25 నుంచి విద్యుత్‌ కార్మికుల పోరాటాలు

25 నుంచి విద్యుత్‌ కార్మికుల పోరాటాలు– టీఎస్‌యూఈఈయూ  రాష్ట్ర కమిటీ పిలుపు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్‌ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 25 నుంచి జూన్‌ 10వతేదీ వరకు పలు రూపాల్లో ఆందోళనలు నిర్వహించనున్నట్టు తెలంగాణ స్టేట్‌ యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీఎస్‌యూఈఈయూ) రాష్ట్ర కమిటీ ప్రకటించింది. రెండ్రోజులపాటు జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశాల్లో విద్యుత్‌ కార్మికుల సమస్యలపై చర్చించినట్టు యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే ఈశ్వరరావు, వీ గోవర్థన్‌ తెలిపారు. గత ప్రభుత్వం తరహాలోనే ప్రస్తుత ప్రభుత్వం కూడా సమస్యల పరిష్కారంలో మొండివైఖరి అవలంబిస్తున్నదని వారు విమర్శించారు. కార్మికులకు రావాల్సిన డీఏ, ఆర్టిజన్స్‌ కన్వర్షన్‌, బిల్‌ కలెక్టర్లు, అన్‌మెన్‌ కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, మీటర్‌ రీడర్ల సమస్యల్లో ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదన్నారు. అర్హత కలిగిన ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వట్లేదని తెలిపారు. రాష్ట్రంలో 1.80 కోట్ల సర్వీసులు ఉంటే, ఇంజినీర్లు, ప్రొవిజన్స్‌ సిబ్బందితో కలిపి కేవలం 53వేల మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారనీ, సిబ్బంది కొరతతో పనిభారాలు పెరుగుతున్నాయని వివరించారు. ఒక్క నిముషం కరెంటు పోవద్దంటూ ఆపరేషన్‌ మెయింటెనెన్స్‌ సిబ్బందిని వేధిస్తున్నారనీ, బ్రేక్‌డౌన్స్‌ సందర్భాల్లో ఎల్సీలు ఇవ్వకుండా పనిచేయాలని చెప్తూ, సిబ్బంది ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫీసుల్లో పనిచేయాల్సిన ఆకౌంట్‌ ఆఫీసర్లు, జూనియర్‌ అక్కౌంట్స్‌ సహా అందరికీ సబ్‌స్టేషన్లలో డ్యూటీలు వేయడం ఏంటని ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వంపై విద్యుత్‌ ఉద్యోగులు అనేక ఆశలు పెట్టుకున్నారనీ, వారి సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి చూపాలని విజ్ఞప్తి చేశారు. పలు సమస్యల పరిష్కారం కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రాన్స్‌కో సీఎమ్‌డీని వినతిపత్రం ఇచ్చామనీ, దానిపై ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. అందువల్ల ఈనెల 25వ తేదీన డివిజనల్‌ ఇంజినీర్లకు, 28న సూపరిటెండెంట్‌ ఇంజినీర్లకు, జూన్‌ 10న డిస్కంల సీఎమ్‌డీలకు వినతిపత్రాలు ఇవ్వాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించిందన్నారు. అప్పటికీ యాజమాన్యాలు స్పందించకుంటే జూన్‌ 10 తర్వాత జరిగే పోరాటాలకు కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చింది.

Spread the love