బదిలీ అయిన టీచర్లను ఎన్నికలయ్యాక రిలీవ్‌ చేయాలి

– యూఎస్‌పీసీ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గత అక్టోబర్‌లో బదిలీ అయిన ఉపాధ్యాయులను పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే రిలీవ్‌ చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) స్టీరింగ్‌ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. మల్టీజోన్‌-2 పరిధిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పదోన్నతులు వెంటనే చేపట్టాలని కోరింది. యూఎస్‌పీసీ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సమావేశాన్ని గురువారం హైదరాబాద్‌లోని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యాలయంలో యు పోచయ్య అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం యూఎస్‌పీసీ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు కె జంగయ్య, చావ రవి, పి నాగిరెడ్డి, టి లింగారెడ్డి, జాడి రాజన్న, జాదవ్‌ వెంకట్రావు, ఎస్‌ హరికిషన్‌, వి శ్రీను నాయక్‌, బి కొండయ్య, వై విజయకుమార్‌, టి లక్ష్మారెడ్డి సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. టెట్‌ విషయంలో ఉపాధ్యాయులకు స్పష్టతనివ్వడంలో విద్యాశాఖ కమిషనర్‌ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శులను కలిసి విద్యాశాఖ కమిషనర్‌పై ఫిర్యాదు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఎన్‌సీటీఈ అధికారులతో ఉపాధ్యాయ సంఘాల సమావేశం ఏర్పాటు చేయించి టెట్‌పై స్పష్టత ఇప్పించటానికి కృషిచేసిన ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానాన్ని ఆమోదించామని పేర్కొన్నారు. బకాయి ఉన్న నాలుగు వాయిదాల డీఏను విడుదల చేయాలనీ, ఈ-కుబేర్‌లో ఉన్న పెండింగ్‌ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. 317 జీవో బాధితులకు న్యాయం చేయాలనీ, మోడల్‌ స్కూళ్లను విద్యాశాఖ పరిధిలోకి తీసుకుని 010 పద్దు ద్వారా వేతనాలివ్వాలని సూచించారు. గురుకులాలు, మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను వేసవి సెలవుల్లోనే పూర్తి చేయాలని తెలిపారు. విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేనాటికే పాఠశాలల్లో విద్యావాలంటీర్లను, పారిశుధ్య కార్మికులను నియమించాలనీ, ఉచిత విద్యుత్‌ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు తగిన సౌకర్యాలను కల్పించాలనీ, అన్ని నియోజకవర్గాల్లో ఒకే విధమైన పారితోషికం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Spread the love