భద్రతా మండలి పరిమితులను వెల్లడించిన ఉక్రెయిన్‌ యుద్ధం

– బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డసిల్వా వ్యాఖ్యలు
బ్రసీలియా : ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న యుద్ధం, ప్రపంచ దేశాల్లో శాంతిని పెంపొందించడంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ‘పరిమితులను’ వెల్లడించిందని బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డసిల్వా బుధవారం వ్యాఖ్యానించారు. తక్షణమే కాల్పుల విరమణ జరిగి, శాశ్వత శాంతి నెలకొల్పేందుకు సమర్ధవంతంగా దోహదపడేలా సంయుక్తంగా కృషి చేపట్టేందుకు తామంతా సిద్ధంగా వున్నామని చెప్పారు. బ్రిక్స్‌ 15వ సదస్సు ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇతర అనేక ఘర్షణలు, సంక్షోభాలపై ఇంతలా దృష్టి కేంద్రీకరించడం లేదని అన్నారు. ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా అనేక ప్రభావాలు కనిపిస్తున్నాయని, ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారని, ముఖ్యంగా వర్ధమాన దేశాల్లోని ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. శాంతి కోసం అన్వేషణ అన్నది సమిష్టి బాధ్యతగా వుండాలని, సుస్థిరమైన అభివృద్ధి కోసం శాంతి అనివార్యమని లూలా పేర్కొన్నారు. ప్రపంచంలో అవగాహన, సహకారం కొరకు ఒక శక్తిగా వ్యవహరించాల్సిందిగా బ్రిక్స్‌ సభ్య దేశాలను లూలా కోరారు.

Spread the love