తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి : లా అండ్ ఆర్డర్ రాష్ట్ర డీజీపీ మహేష్ భగవత్
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
మనిషి ప్రాణం ఎంతో విలువైందని, ఒక చిన్న నిర్లక్ష్యం కారణంగా ఒకరి చావుకు కారణం కావొద్దని తెలంగాణ లా అండ్ ఆర్డర్ డీజీపీ మహేష్ మురళీధర్ భగవత్ అన్నారు. బుధవారం సంగారెడ్డి మండలం పసల్వాది గ్రామంలోని జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆవరణలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఏడాదికి సుమారు 7500 మంది రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందుతున్నారని, అంటే రోజుకు సగటున 21 మంది మరణిస్తున్నట్టు తెలిపారు. ప్రమాదాలు జరిగినప్పుడు భయపడేకంటే ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ కచ్చితంగా హెల్మెట్‌ను ధరించాలని, కారులో వెళితే కచ్చితంగా సీట్ బెల్ట్‌ను ధరించాలని సూచించారు. రోడ్డుపై అనుకొని ప్రమాదం జరిగితే క్షతగాత్రులను అందుబాటులో ఉన్న వాహనాల్లో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాలని సూచించారు. గాయపడ్డ క్షతగాత్రులను ఆస్పత్రులకు చేర్చితే ఎలాంటి కేసులు ఉండవని, అలా చేసిన వారికి రవాణా శాఖ తరపున నగదు పురస్కారం కూడా అందించే అవకాశం ఉంటుందని తెలిపారు.
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. మనిషికి ప్రాణం ఉంటేనే ప్రపంచం ఉంటుందని అన్నారు. ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు టూ వీలర్ వల్లనే అవుతాయని, వాహనాలు నడిపించే యువకులు అందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం బాధ్యతగా పెట్టుకోవాలని సూచించారు. గ్రామంలో ఇకపై నుంచి హెల్మెట్ ధరిస్తేనే అనుమతించేలా ‘నో హెల్మెట్.. నో ఎంట్రీ’ తీర్మానానికి స్థానిక సర్పంచ్ హరిప్రసాద్ పిలుపునిచ్చారు. దీనికి గ్రామస్తులు కూడా మద్దతు పలికారు. అనంతరం రోడ్డు భద్రత విషయాలపై జిల్లా పోలీసు అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఎస్‌ఈడీ ప్రదర్శన, కళాజాతాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఉమ్మడి జిల్లా ఉప రవాణా కమిషనర్ వెంకటరమణ, అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, డీఎంహెచ్‌వో లలితాదేవి, ఆర్డీవో రాజేందర్, డీఎస్పీ సత్యయ్య గౌడ్, తహసీల్దార్ దశరథ్, జిల్లా పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మనిషి ప్రాణం విలువ ఎంతో గొప్పది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



