వీరతెలంగాణ సాయుధ పోరాటం అజరామరం

The Veeratelangana armed struggle is immortal– చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ
–  సీట్లు, పొత్తుల కోసం కమ్యూనిస్టు పార్టీ పనిచేయదు
–  బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి నడుస్తాం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవ తెలంగాణ-సిద్దిపేట అర్బన్‌
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చారిత్రాత్మకం. అది ప్రజాపోరాటాలకు నిరంతర స్ఫూర్తి. ఈ దేశ భవిష్యత్తుకు మార్గదర్శి. అలాంటి పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట పట్టణంలోని శివమ్స్‌ గార్డెన్‌లో శుక్రవారం నిర్వహించిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల సంస్మరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. సెప్టెంబర్‌ 10 నుంచి 17 వరకు తెలంగాణ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలో రైతాంగ సాయుధ పోరాటంలో మొట్టమొదటి అమరుడు దొడ్డి కొమరయ్య అని తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని, పీడిత ప్రజల పోరాటాలను హిందు ముస్లిమ్‌ల మధ్య పోరాటంగా బీజేపీ నాయకులు చెప్పడం సిగ్గుచేటన్నారు. ముస్లిం మైనార్టీలను అణగదొక్కడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. మునుగోడు ఎన్నికల్లో బీజేపీని ఓడగొట్టడం కోసమే బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నామని, కమ్యూనిస్టులతోనే అక్కడ బీజేపీ ఓడిపోయిందని తెలిపారు. తెలంగాణలో బీజేపీని అడ్డుకోవడమే సీపీఐ(ఎం) లక్ష్యమన్నారు. సీట్ల కోసం, పొత్తుల కోసం కమ్యూనిస్టు పార్టీ వెంపర్లాడదని, ప్రజల కోసమే పనిచేస్తుందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అన్న ప్రచారంతో బీఆర్‌ఎస్‌కు మైనార్టీ వర్గాలు దూరమయ్యే పరిస్థితి ఉంటుందని, ముస్లింల ఓట్లు పడకపోతే బీఆర్‌ఎస్‌ పార్టీ ఓడిపోతుందన్నారు. కవితకు మళ్ళీ ఈడీ నోటీసులు వచ్చిన సంగతిని గుర్తు చేశారు. ఈడీ నోటీసులు మళ్లీ రావడం వెనుక ఆంతర్యం ఏమిటో బీజేపీ, బీఆర్‌ఎస్‌ చెప్పాలన్నారు. తెలంగాణ వచ్చినంక దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు, ఉద్యోగాలు ఇస్తామని హామీలిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, వాటిని నెరవేర్చడంలో విఫలమైందన్నారు. దళిత బంధు ఇస్తానని అక్కడక్కడ శాంపిల్‌ చూయించి దళితులను ఆగం చేస్తున్నారని, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తానని ఇప్పటివరకు ఇవ్వలేదని ఆరోపించారు. భవిష్యత్తు ఎన్నికల్లో సీపీఐతో కలిసి పోరాడుతామని, ఇతరపక్షాలతో అవసరమైన విధంగా పొత్తులు పెట్టుకుంటామన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కరాములు, పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు గోపాలస్వామి, జిల్లా నాయకులు శశిధర్‌, కళావతి, రవికుమార్‌, భాస్కర్‌, ఎల్లయ్య, యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love