ప్రచారానికి మా గ్రామాల్లోకి బీజేపీ నేతలు రావొద్దు..బోర్డులు పెట్టిన గ్రామస్థులు

నవతెలంగాణ-హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే, పంజాబ్‌లోని పలు గ్రామాల్లో ప్రచారానికి వెళ్తున్న బీజేపీ నేతలకు వింత పరిస్థితులు ఎదురవుతున్నాయి. తమ గ్రామాల్లోకి బీజేపీ నేతలు రావొద్దని, ప్రచార కార్యక్రమాలు చేపట్టవద్దని భటిండా, సంగ్రూర్‌ జిల్లాల్లోని భారూ, మాన్సా, మండికలాన్‌ తదితర గ్రామాల శివారుల్లో పలు బ్యానర్లు, బోర్డులను గ్రామస్థులు ఏర్పాటు చేశారు. ‘రైతు సమస్యలపై ఢిల్లీలో నిరసనలు చేపట్టాలనుకొంటే, మమ్మల్ని రానివ్వట్లేదు. అందుకే, మిమ్మల్నీ మా ఊళ్లలోకి రానివ్వం’, ‘మీకు (బీజేపీ) ఓటేస్తే, మళ్లీ నల్లచట్టాలను తీసుకొస్తారు’, ‘శంభూ సరిహద్దుల్లో శాంతియుత నిరసనలు చేస్తున్న రైతులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 19 ఏండ్ల యువరైతు శుభ్‌కరణ్‌ సింగ్‌ మరణించాడు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ దారుణానికి పాల్పడ్డ మీరు మా గ్రామాల్లోకి రావొద్దు’ అని బ్యానర్లు, బోర్డుల్లో రాసి ఉంది.
రైతుల నిరసనలు ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో పలు ఎన్నికల సభలను బీజేపీ నేతలు రద్దు చేస్తుండటం కూడా కనిపిస్తున్నది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గత నెల 24న భటిండాలో ‘బీజేపీ మహోత్సవ్‌’ పేరిట సభ నిర్వహించాలనుకొన్నారు. బీజేపీ పంజాబ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్‌ జాఖర్‌ హాజరవ్వాల్సి ఉంది. అయితే, రైతులు, స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ సభను బీజేపీ అధిష్ఠానం రద్దు చేసింది. మరో సభ కూడా ఇలాగే రైద్దెనట్టు సమాచారం. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం) నేతలు కూడా పెద్దయెత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు.

Spread the love