Friday, September 18, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుతెలంగాణ నేలది ధిక్కార స్వరం

తెలంగాణ నేలది ధిక్కార స్వరం

- Advertisement -

అన్యాయాన్ని ఎదిరించడం ఈ గడ్డ స్వభావం
భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసమే కమ్యూనిస్టుల సాయుధ పోరాటం
సెప్టెంబర్‌ 17 ప్రజాస్వామిక పాలనకు 
మార్గం వేసిన రోజు
రైతులకు భరోసా ఉండాలి…
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
ప్రతి పేదబిడ్డకూ విద్య, వైద్యం అందించడమే లక్ష్యం
ప్రతి ప్రాంతానికీ అభివృద్ధి చేరాలనే లక్ష్యంతో పాలన : ప్రజాపాలన దినోత్సవంలో సీఎం రేవంత్‌‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తరతరాల అణచివేత, దోపిడీ, భూస్వామ్య, పెత్తందారీ విధానాలపై ధిక్కార స్వరం వినిపించిన నేల తెలంగాణ అనీ, సమ్మక్క సారలమ్మ పోరాటం, తెలంగాణ రైతాంగ సాయు ధ పోరాటం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వరకు ఏది చూసినా అన్యాయాన్ని ఎదిరించడమే తెలంగాణ గడ్డ స్వభావ మని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌‌రెడ్డి చెప్పారు. అస్తిత్వం, ఆత్మ గౌరవం, హక్కుల కోసం ఈ నేల ఎప్ప టికప్పుడు ప్రజా చైతన్యాన్ని రగిలి స్తూనే ఉందన్నారు. తెలంగాణ చరిత్ర ప్రజలే కేంద్రంగా పాలన ఉండాలని చెబుతున్నదనీ, అదే స్ఫూర్తితో ప్రజల ఆత్మగౌరవానికి పట్టం కడుతూ, ప్రపంచంతో పోటీపడేలా ప్రజా పాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. గురువారం హైదరాబాద్‌‌లోని పబ్లిక్‌ ‌గార్డెన్‌‌లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.

భారతదేశంలో నిజాం ప్రాంతం అంతర్భాగం కావాలన్న ఆకాంక్షతో ఆంధ్రమహాసభ, హైదరాబాద్‌ ‌స్టేట్‌ ‌కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పోరాటాలు జరిగాయని వివరించారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం ఆనాడు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో జరిగిన పోరాటానికి రావి నారాయణరెడ్డి, భీంరెడ్డి నరసింహారెడ్డి, చిట్యాల ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం వంటి ఎందరో యోధులు నాయకత్వం వహించారని తెలిపారు. ఆపరేషన్‌ ‌పోలోతో నిజాం ప్రభువు భారత ప్రభుత్వానికి లొంగిపోయారనీ, 1947 సెప్టెంబర్‌ 17 ‌నిజాం రాచరిక పాలన నుంచి ప్రజాస్వామిక పాలనకు మార్గం తెరుచుకున్న చారిత్రాత్మక సందర్భమని చెప్పారు. అందుకే ప్రజా పాలన దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. సమస్యలకు పరిష్కారం చూపడం, హక్కులను కాపాడటం, ప్రభుత్వ వనరులు అందరికీ అందేలా చూడటం, ప్రతి మనిషీ ఆత్మగౌరవంతో జీవించే పరిస్థితి కల్పించడమే ప్రజా పాలన అని స్పష్టం చేశారు.

​ప్రజాప్రభుత్వం రైతు పక్షపాతి
ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాతి అనీ, రూ.20,616 కోట్లు విడుదల చేసి రుణమాఫీ ద్వారా 23.35 లక్షల రైతుల కుటుంబాలను అప్పుల ఊబి నుంచి బయపడేశామని సీఎం రేవంత్‌‌రెడ్డి చెప్పారు. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశామని గుర్తుచేశారు. రైతు సంక్షేమానికి, వ్యవసాయానికి రూ.1.72 లక్షల కోట్లు ఖర్చుచేశామని వివరించారు. భూభారతి చట్టం ద్వారా సంస్కరణలు తీసుకొచ్చామనీ, భూధార్‌, ఏఐ ఆధారిత భూమిత్ర సేవలు ప్రారంభించామనీ, 5.94 లక్షల మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందజేశామని చెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం న్యాయ పోరాటం చేస్తున్నామనీ, పాలమూరు రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతలు, ఎస్‌ఎల్‌‌బీసీ వంటి పెండింగ్‌ ‌ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931కి చేరిందనీ, ఇది దేశ తలసరి ఆదాయం కన్నా దాదాపు 91 శాతం అధికమని చెప్పారు.

​ఆడబిడ్డ సగర్వంగా జీవించాలి…ఆర్థికంగా, స్వతంత్రంగా ఎదగాలి
రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డా ఆర్థికంగా, స్వతంత్రంగా ఎదిగి సగర్వంగా జీవించాలని సీఎం రేవంత్‌‌రెడ్డి ఆకాంక్షించారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆడబిడ్డలకు రూ.12,385 కోట్ల ఖర్చు ఆదా అయిందని వివరించారు. 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, 43 లక్షల కుటుంబాలకు రూ.500 కే గ్యాస్‌ ‌సిలిండర్‌ అందిస్తున్నామని తెలిపారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ‌ద్వారా 1.68 లక్షల మంది ఆడబిడ్డలకు రూ.4,709 కోట్ల సహాయం చేశామని చెప్పారు. స్వయం సహాయక సంఘాలకు రూ.60,487 కోట్ల బ్యాంకు లింకేజి, రూ.1,900 కోట్ల వడ్డీ రాయితీ కల్పించామని వివరించారు. మహిళా మార్టులు, పెట్రోల్‌ ‌బంకులు, ఆర్టీసీ అద్దెబస్సులు, సోలార్‌ ‌ప్లాంట్ల ద్వారా మహిళలను ఆర్థిక వ్యవస్థలో భాగస్వామిగా నిలబెడుతున్నామని సగర్వంగా చెప్పారు.

​ప్రతి కుటుంబమూ ఆత్మగౌరవంతో జీవించాలి
రాష్ట్రంలోని ప్రతి కుటుంబమూ ఆత్మగౌరవంతో జీవించాలన్నదే తమ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌‌రెడ్డి స్పష్టం చేశారు. 15 లక్షలకుపైగా కొత్త రేషన్‌‌కార్డులు జారీ చేశామనీ, ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా 3.42 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో 45 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామనీ, త్వరలో మరో 2.25 లక్షల మందికి ఇస్తామని ప్రకటించారు. ఇందిరమ్మ ఇండ్లకు తొలిదశలో రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. రెండో దశలో మరో 2.50 లక్షల ఇండ్లు మంజూరు చేశామనీ, హైదరాబాద్‌ ‌పరిధిలో ఇందిరమ్మ టవర్ల ద్వారా లక్ష ఇండ్లు కడుతామని తెలిపారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వేను శాస్ర్తీయ పద్ధతిలో నిర్వహించామనీ, దాని ఆధారంగా విద్య, ఉపాధి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును శాసనసభలో ఆమోదించి రాష్ట్రపతికి పంపామని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు తీర్పుననుసరించి దేశంలోనే తొలిసారి ఎస్సీ వర్గీకరణ చేపట్టామని తెలిపారు. అందుకే ప్రతి ఏటా ఫిబ్రవరి నాలుగో తేదీన తెలంగాణ సోషల్‌ ‌జస్టిస్‌ ‌డేను నిర్వహిస్తున్నామన్నారు.

​విద్యా, వైద్యం రెండు కండ్లు
తమ ప్రజాప్రభుత్వానికి విద్యా, వైద్యం రెండు కండ్లలాంటివని సీఎం రేవంత్‌‌రెడ్డి చెప్పారు. నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఒక్కో నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్‌ ‌స్కూళ్లను నిర్మిస్తున్నామన్నారు. విద్యార్థులకు అల్ఫాహారం, పాలు ఇచ్చేందుకు రూ.927 కోట్లు ఖర్చుచేస్తున్నామని చెప్పారు. 11 లక్షలమంది విద్యార్థులకు నేరుగా స్కాలర్‌‌షిప్పులు, ఫీజు రీయింబర్స్‌‌మెంట్లనే నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తున్నామని వివరించారు. విద్యారంగంలో తీసుకున్న చర్యలతో తెలంగాణ 28వ స్థానం నుంచి 18వ స్థానానికి చేరిందని తెలిపారు. అమెరికాకు చెందిన నార్త్‌ ఈస్టర్న్‌ ‌యూనివర్సిటీ, బ్రిటన్‌‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ ‌ద్వారా ఆఫ్‌‌షోర్‌ ‌క్యాంపస్‌‌లను ఏర్పాటు చేయించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామనీ, సీఎంఆర్‌ఎఫ్‌ ‌ద్వారా రూ.2,526 కోట్ల సహాయాన్ని అందించామని వివరించారు. గోషామహల్‌‌లో రూ.2,700 కోట్లతో నూతన ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం మొదలైందన్నారు. సనత్‌‌నగర్‌ ‌టిమ్స్‌‌ను ప్రారంభించామనీ, అల్వాల్‌, ఎల్బీనగర్‌ ‌టిమ్స్‌‌లను, వరంగల్‌ ఆస్పత్రిని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని హామీనిచ్చారు. 72 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామనీ, ఆ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. యువతలో నైపుణ్యాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ యంగ్‌ ఇండియా స్కిల్స్‌ ‌యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. ఐటీఐలను అడ్వాన్డ్స్‌ ‌సెంటర్లుగా అప్‌‌గ్రేడ్‌ ‌చేస్తున్నామనీ, పాలిటెక్నిక్‌ ‌కాలేజీల్లో కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నామని చెప్పారు.

​మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నాం
రాష్ట్రంలో మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామనీ, రూ.38,595 కోట్లతో 122.9 కిలోమీటర్ల మెట్రో రెండో దశ విస్తరణకు ప్రతిపాదనలు పంపామనీ, ఆదిలాబాద్‌, మామునూరు ఎయిర్‌‌పోర్టులకు అనుమతులు సాధించామని సీఎం రేవంత్‌‌రెడ్డి తెలిపారు. 55 కిలోమీటర్ల పరిధిలో మూసీని పునరుజ్జీవింపజేస్తున్నా మన్నారు. ఆహార కల్తీని అరికట్టేందుకు టీజీసేఫ్‌, మాదకద్రవ్యాల నిర్మూలనకు ఈగల్‌ ‌వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం, దేశ జీడీపీలో 10 శాతానికి వాటాను పెంచాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని వివరించారు. దాదాపు 30 వేల ఎకరాల్లో ప్రత్యేక జోన్లతో భారత్‌ ‌ఫ్యూచర్‌ ‌సిటీని దేశంలోనే తొలి నెట్‌ ‌జీరో స్మార్ట్‌ ‌సిటీగా నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణ గ్లోబల్‌ ‌సమ్మిట్‌ 2026లో ఫ్యూచర్‌ ‌సిటీ మాస్టర్‌ ‌ప్లాన్‌‌ను ఆవిష్కరిస్తామని చెప్పారు. రీజినల్‌ ‌రింగురోడ్డు, గ్రీన్‌‌ఫీల్డ్‌ ‌హైవేలు, డ్రైపోర్టులు, పారిశ్రామిక కారిడార్లు తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అర్‌అండ్‌‌బీ పరిధిలో రూ.13 వేల కోట్లతో, పంచాయతీరాజ్‌ ‌శాఖ ద్వారా రూ.6,924 కోట్లతో రహదారుల పనులు సాగుతున్నాయన్నారు. ఎల్‌‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయనీ, ఈ నేపథ్యంలో తాగునీరు, విద్యుత్‌ ‌సరఫరాలో ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికలతో పనిచేస్తున్నామని తెలిపారు. దీనిపై ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించే విషయంలో జర్నలిస్టులు సహకరించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -