అసెంబ్లీలో కమ్యూనిస్టుల గొంతుకనవుతా

Communists in the Assembly will be sore– నిర్బంధం, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడతా
–  మద్దతిచ్చిన సీపీఐ(ఎం), టీజేఎస్‌, ఎంఎల్‌ పార్టీలకు ధన్యవాదాలు
–  కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
– మంత్రివర్గంలో చేరాలని కాంగ్రెస్‌ ప్రతిపాదిస్తే ఆలోచిస్తాం : నారాయణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అసెంబ్లీలో కమ్యూనిస్టు పార్టీలన్నింటికీ తాను గొంతుకనవుతాననీ, ప్రజాసమస్యలను లేవనెత్తుతానని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రభుత్వాల నిర్బంధం, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడతానని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వమే నిర్బంధాలు, అణచివేతలు, నిరంకుశత్వానికి వ్యతిరేకమని అన్నారు. నిజాం నవాబు క్రూర రాచరిక పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ రైతాంగ సాయుధ పోరాటాన్ని చేపట్టి తెలంగాణాను విముక్తి చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో నాటి పరంపర కొనసాగిందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు నిర్బంధం ఉన్నా స్వేచ్ఛ ఉండేదని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఈ పదేండ్లలో స్వేచ్ఛ లేదన్నారు. బాధను కూడా వ్యక్తం చేయలేని పరిస్థితి ఉందనీ, ఊపిరి ఆడనివ్వకుండా నిర్బంధాలతో ఉండేదని అన్నారు. ఆందోళనకు దిగితే ముందస్తు అరెస్టులు జరిగేవనీ, బంగారు తెలంగాణ అంటూ బీఆర్‌ఎస్‌ ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటీ అమలు కాలేదని విమర్శించారు. అధికారం శాశ్వతమనుకుని నిర్బాంధాలకు పాల్పడితే ప్రజలు సహించబోరనీ, తిప్పికొడతారనే విషయాన్ని ఈ ఎన్నికల్లో నిరూపించారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు విశ్వసించారని చెప్పారు. ఎన్నికల పొత్తు అంశంలో తమ పట్ల సీపీఐ(ఎం) హుందాగా వ్యవహారించిందనీ, ఆ పార్టీ నాయకులు తమ విజయానికి బాగా కష్టపడ్డారని కూనంనేని అన్నారు. సీపీఐ(ఎం) పోటీచేసిన 19 స్థానాలతోపాటు కొత్తగూడెంలో సీపీఐ విజయం కోసం కృషి చేశారని వివరించారు. కొత్తగూడెం ఎమ్మెల్యేగా తనను భారీ మెజార్జీతో గెలిపించినందుకు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. తన విజయానికి కృషి చేసిన కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐ (ఎంఎల్‌), టీడీపీ, టీజేఎస్‌, వైఎస్‌ఆర్‌టీపీ, ప్రగతిశీల శక్తులకు, ఓటర్లకు కృతజతలు చెప్పారు. తనను పోటీ చేసే అవకాశం కల్పించిన తమ పార్టీ జాతీయ, రాష్ట్ర పార్టీకి ధన్యవాదాలు ప్రకటించారు.
పర్యాటక భవనం అగ్నిప్రమాదంపై న్యాయవిచారణ జరపాలి : నారాయణ
మంత్రివర్గంలో చేరాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదిస్తే ఆలోచన చేసి పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. పర్యాటక శాఖ పరిపాలన భవనం అగ్నిప్రమాదంపైన న్యాయవిచారణ జరపాలనీ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో వందల కోట్ల రూపాయల దుర్వినియోగం బయటపడుతుందని భావించి విలువైన దస్త్రాలను పర్యాటక శాఖ ఎండీ, మంత్రి తగుబెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అందరినీ కలుపుకుని, విశాల దృక్పథంతో ముందుకెళ్తే, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌ వంటి వాతావరణం ఉండబోదని స్పష్టం చేశారు. ఇండియా కూటమి బలపడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటినర్సింహా తదితరులు పాల్గొన్నారు.

Spread the love