బైడెన్‌ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు : వైట్‌ హౌస్‌

నవతెలంగాణ – వాషింగ్టన్‌:  భారత్‌-మిడిల్‌ఈస్ట్‌ -యూరప్‌ ఎకనామిక్‌ కారిడార్‌ ఒప్పందం హమాస్‌ దాడులకు కారణమైందని బైడెన్ పేర్కొన్నారంటూ   మీడియాలో వస్తున్న  వార్తలను గురువారం  వైట్‌ హౌస్‌ తిరస్కరించింది. హమాస్‌ దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొంది. నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్స్‌ స్ట్రాటజిక్‌ కమ్యూనికేషన్స్‌ కో ఆర్డినేటర్‌ జాన్‌ కిర్బీ మీడియాతో మాట్లాడారు. ‘అధ్యక్షుడు బైడెన్‌ వ్యాఖ్యలను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. రెండు దేశాల (ఇజ్రాయిల్‌ , సౌదీ అరేబియా) మధ్య సంబంధాలను సాధారణీకరించేందుకు ఉద్దేశించిన ఒప్పందాన్ని ఆయన విశ్వసిస్తున్నారు. ఇది రెండు దేశాల మధ్య సంబంధాల్లో ముఖ్యమైన అడుగని భావిస్తున్నారు. ఇదే హమాస్‌ దాడుల్ని ప్రేరేపించి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మాటలనే తప్పుగా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను’ అని అన్నారు. గురువారం ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బెనీస్‌తో కలిసి అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మాట్లాడుతూ.. హమాస్‌ దాడుల వెనక భారత్‌ – మిడిల్‌ ఈస్ట్‌ – యూరప్‌ ఎకనామిక్‌ కారిడార్‌ ప్రకటన కూడా ఒక కారణం అయి ఉండొచ్చున్నారు.  దీనికి సంబంధించిన రుజువులేవీ తమ దగ్గర లేవని, అయితే అది కూడా కారణమని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం ఇజ్రాయెల్‌ కోసం, ప్రాంతీయ సమైక్యత కోసం చేపట్టిన పురోగతి అయినందున.. ఎట్టి పరిస్థితుల్లో ఆ కారిడార్‌ విషయంలో వెనక్కి తగ్గమని బైడెన్‌ పేర్కొన్నారు.

Spread the love