ఉపాధ్యాయుడి హత్యలో భార్యే సూత్రధారి

ఉపాధ్యాయుడి హత్యలో భార్యే సూత్రధారి– వివాహేతర సంబంధమే కారణొం నలుగురి రిమాండ్‌
– వివరాలు వెల్లడించిన డీఎస్పీ నాగేందర్‌
నవతెలంగాణ- ఉట్నూర్‌
ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజేందర్‌ హత్యకేసులో భార్యనే సూత్రధారి అని తేలింది. ఈ కేసును పోలీసులు నాలుగు రోజుల్లోనే ఛేదించారు. నలుగురు నిందితులను పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. శనివారం ఉట్నూర్‌ డీఎస్పీ తన కార్యాలయంలో హత్య కేసు వివరాలు వెల్లడించారు. జాదవ్‌ గజేందర్‌ జైనథ్‌ మండలంలోని మేడిగూడ జెడ్పీఎస్‌ఎస్‌ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆదిలాబాద్‌లోని రాంనగర్‌లో భార్య విజయలక్ష్మి, కొడుకుతో కలిసి నివాసం ఉండేవాడు. వేసవి సెలవుల్లో స్వగ్రామం నార్నూర్‌ మండలంలోని నాగల్‌కొండకు వచ్చారు. పాఠశాలల పున:ప్రారంభం రోజున స్వగ్రామం నుంచే విధులకు బయలుదేరగా.. హత్యకు గురయ్యాడు. దీనికి అతని భార్యనే సూత్రధారిగా పోలీసులు విచారణలో తేల్చారు. జాదవ్‌ భార్య విజయలక్ష్మి 2015లో నిజామాబాద్‌లో డిగ్రీ చదువుకుంది. అక్కడే డిగ్రీ చదివిన రాథోడ్‌ మహేష్‌, ఆమె ప్రేమించుకున్నారు. వీరిద్దరూ ఒకే మండలానికి చెందిన వారు. కానీ, 2017లో విజయలక్ష్మికి తల్లిదండ్రులు జాదవ్‌ గజేందర్‌తో వివాహం చేశారు. వారికి ఒక కొడుకు ఉన్నాడు. జాదవ్‌కు చిన్న వికలాంగత్వం ఉంది. దీంతో అతన్ని అయిష్టంగానే పెండ్లి చేసుకున్న విజయలక్ష్మి ఆ తర్వాత రాథోడ్‌ మహేష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తను ఎలాగైనా చంపాలని ప్రియుడు మహేష్‌తో మాట్లాడి హత్యకు పథకం పన్నింది. ఈ నెల 12న పాఠశాలల పున:ప్రారంభం అవుతున్న నేపథ్యంలో 11న మహేష్‌కు ఫోన్‌ చేసి జాదవ్‌ లోకారి వైపు నుంచి ద్విచక్ర వాహనంపై పాఠశాలకు వెళ్తాడని తెలిపింది. దీంతో మహేష్‌ తన స్నేహితులైన బేల మండలానికి చెందిన బోదే సుశీల్‌, ఉరివెత కృష్ణతో కలిసి హత్యకు ప్లాన్‌ వేశారు. జాదవ్‌ ఈనెల 12న పాఠశాలకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా అర్జుని గ్రామ శివారులో ద్విచక్ర వాహనంతో ఢకొీట్టడంతో అతను కింద పడిపోయాడు. లాక్కుంటూ కొద్ది దూరం తీసుకెళ్లి తలపై బండతో కొట్టి చంపారు. విచారణలో వివాహేతర సంబంధంతోనే ఈ హత్య జరిగిందని పోలీసులు నిర్ధారించారు. దాంతో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో ఉట్నూర్‌ సీఐ మొగిలి, నార్నూరు సీఐ రహీం పాషా ఉన్నారు.

Spread the love