పట్టాలపై పనిచేస్తుండగా దూసుకొచ్చిన రైలు.. నదిలోకి దూకేసిన కార్మికుడు

నవతెలంగాణ- బీహర్: బీహార్‌లోని సహర్సా జిల్లాలో ఓ రైల్వే కార్మికుడు పట్టాలపై పనిలో ఉన్న సమయంలో అకస్మాత్తుగా రైలు రావడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు మరో ఆలోచన లేకుండా పట్టాల కిందనున్న నదిలోకి దూకేశాడు. అశోక్ కుమార్ అనే కార్మికుడు రైల్వే పట్టాలపై పనిచేస్తుండగా ఒక్కసారిగా రైలు దూసుకొచ్చింది. తప్పించుకునే మార్గం లేకపోవడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు భాగ్‌మతీ నదిలోకి దూకాడు. అతడు నదిలో దూకడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. పెద్ద తాడును నదిలోకి విసిరి అశోక్‌ను కాపాడారు. మరోవైపు, సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కార్మికుడిని ఆస్పత్రికి తరలించారు.

Spread the love