సింహం నోట్లో ఆవు తల.. ధైర్యంగా ముందుకెళ్లి రక్షించిన యువకుడు

నవతెలంగాణ- హైదరాబాద్: మరికొన్ని క్షణాలు ఆలస్యమైతే సింహానికి ఆ గోవు ఆహారంగా మారిపోయేదే. గోవుపై దాడిచేసిన ఆడసింహం దాని తలను గట్టిగా పట్టుకుని చంపేందుకు యత్నించింది. అది చూసిన రైతు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎదురెళ్లి గోవును రక్షించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుజరాత్‌లోని గిర్ సోమ్‌నాథ్ జిల్లా అలీదార్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. వీడియో ప్రకారం.. రోడ్డుపై ఓ సింహం గోవు మెడపట్టుకుని చంపేందుకు ప్రయత్నించింది. బాధతో విలవిల్లాడుతున్న ఆవు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ పెనుగులాడుతోంది. దాని అరుపులు విన్న రైతు అక్కడికొచ్చి సింహాన్ని చూశాడు. సింహం బారి నుంచి తన గోవును కాపాడేందుకు చెయ్యెత్తి గట్టిగా అరుస్తూ సింహాన్ని భయపెట్టే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో కింద ఏమైనా దొరకుతుందేమోనని చూసి ఓ రాయిని తీసుకుని సింహాన్ని అదిలిస్తూ వెళ్లాడు. దీంతో భయపడిన సింహం ఆవును వదిలేసి పరారైంది. గోవు బయటపడింది.

Spread the love