నవతెలంగాణ – సిక్కిం: సిక్కింను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఆకస్మిక వరదల ధాటికి రోడ్లు కొట్టుకుపోయాయి. ఈ కారణంగా ఉత్తర సిక్కిం జిల్లాలోని లాచెన్- లాచుంగ్ ప్రాంతంలో 2,400 మందికిపైగా పర్యాటకులు చిక్కుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. చుంగ్తాంగ్‌కు వెళ్లే రహదారి అనేక చోట్ల దెబ్బతినడంతో రాకపోకలు నిలిచిపోయినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన జిల్లా విపత్తు నిర్వహణ సిబ్బంది, సిక్కిం పోలీసులు, బీఆర్‌వో, ఐటీబీపీ, ఆర్మీ బృందాలు కలిసి సహాయక చర్యలు మొదలుపెట్టాయి. పర్యాటకుల తరలింపునకు తాత్కాలిక వంతెనలను ఏర్పాటు చేశాయి. మొత్తం 2,464 మందిని తరలించేందుకు 19 బస్సులు, 70 చిన్న వాహనాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.