లేదంటూనే మూడు రాష్ట్రాల్లో కోచ్‌ ఫ్యాక్టరీలు

There are coach factories in three states– కాజీపేటకు మోడీ మొండిచేయి
– చిరకాల కాంక్షను చిదిమేసిన బీజేపీ..
– వ్యాగన్‌తో చేతులు దులుపుకున్న కేంద్ర సర్కార్‌
– వరంగల్‌ సభలో పెదవి విప్పని ప్రధాని మోడీ
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
దేశంలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీల అవసరం లేదని 2016లో ఆనాటి కేంద్ర రైల్వే సహాయ మంత్రి మనోజ్‌సింగ్‌.. ప్రకటన చేసిన అనంతరం మహారాష్ట్ర, గుజరాత్‌, అసోం రాష్ట్రాల్లో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీలను మంజూరు చేయడం గమనార్హం. రాష్ట్రంలో మాత్రం విభజన చట్టంలోని హామీలను ఉల్లంఘించి మరీ.. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీకి బదులు వ్యాగన్‌ కోచ్‌ ఫ్యాక్టరీ ఇచ్చి మోడీ చేతులు దులుపుకున్నారు. 44 ఏండ్ల కాజీపేట చిరకాల స్వప్నాన్ని చిదిమేసింది బీజేపీ. ప్రధాని మోడీ గుజరాత్‌లో రూ.20 వేల కోట్లతో ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్స్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకొని, కాజీపేటలో మాత్రం రూ.521 కోట్లతో వ్యాగన్‌ తయారీ కేంద్రం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్‌పై వర్ణ వివక్ష ఆరోపణలు చేసిన మోడీ.. కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీపై పెదవి విప్పలేదు. అయితే నూతన పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవానికి మాత్రం రాష్ట్రపతి ముర్మును ఆహ్వానించలేదు. కాగా, కష్టకాలంలో బీజేపీకి వరంగల్‌ ప్రజలు వెన్నంటి ఉన్నారని చెప్పిన ప్రధాని.. కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ప్రస్తావించకపోవడం ఉమ్మడి వరంగల్‌ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనేది ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ. 44 ఏండ్లుగా ఎన్నో ఉద్యమాలు, రాజకీయాలకతీతంగా జాయింట్‌ యాక్షన్‌ కమిటీగా ఏర్పడి పోరాటాలు జరిగాయి. రైల్వే కార్మిక సంఘాలు సైతం జాయింట్‌ యాక్షన్‌ కమిటీగా ఏర్పడి ఆందోళనలను నిర్వహించాయి. అలాంటి సుదీర్ఘ పోరాటాన్ని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ సర్కార్‌ నిర్వీర్యం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పార్లమెంటులో అమోదించిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన కీలక హామీల్లో కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీతోపాటు బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, ఐటీఐఆర్‌ ఏర్పాటు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కాజీపేట రైల్వే జంక్షన్‌ ఉత్తర, దక్షిణ భారత దేశాన్ని కలిపే రైల్వే వారధిగా ఉంది. ఈ ప్రాంతంలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే పెద్ద సంఖ్యలో తెలంగాణ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎంతోకాలంగా యువకులు ఆశతో ఎదురుచూశారు. ఆ తర్వాత మోడీ అధికారంలోకి రాగా పార్లమెంటులో ఎన్నో సందర్భాల్లో కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ విషయం ప్రస్తావించినా, దేశంలో కోచ్‌ ఫ్యాక్టరీల ఏర్పాటు అవసరం లేదని 2016లో నాటి రైల్వే సహాయ మంత్రి మనోజ్‌ ప్రకటన చేశారు. ఆ ప్రకటన అనంతరం మహారాష్ట్రలోని లాతూరు, గుజరాత్‌లోని దహౌడ, అస్సాంలోని కొకర్‌జహార్‌లలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీలను మంజూరు చేశారు. దీనిపై తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఉమ్మడి వరంగల్‌ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
కాజీపేటకు మోడీ మొండిచేయి..
పార్లమెంటులోనే ఎన్డీఏ ప్రభుత్వం కోచ్‌ ఫ్యాక్టరీలు అవసరం లేదని ప్రకటన చేసి కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ డిమాండ్‌ను అటకెక్కించి మహారాష్ట్ర, గుజరాత్‌, అసోంలో ఏర్పాటు చేయడాన్ని ఏమనాలో బీజేపీ నేతలు చెప్పాల్సి ఉంది. ఇదిలావుంటే కాజీపేటలో అవసరం లేని రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ మూడు రాష్ట్రాల్లో ఎలా ఏర్పాటు చేశారో మరీ ఎన్డీఏ పాలకులు తెలంగాణ ప్రజలకు వివరించాల్సిన అవసరముంది. దీనిపై తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రాంతం పట్ల, ముఖ్యంగా కాజీపేట రైల్వే అభివృద్ధి పట్ల మోడీ ప్రభుత్వం వివక్ష చూపిందన్న భావనలో స్థానికులున్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని మోడీ కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుపై పెదవి విప్పలేదు. వరంగల్‌ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అరూరి రమేష్‌ కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేసినా, ప్రధాని స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీ కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయకుండా తన సొంత రాష్ట్రంలో 2022 ఏప్రిల్‌లో రూ.20 వేల కోట్లతో ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్స్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవడం వివక్ష కాకపోతే మరేమనాలని ప్రొఫెసర్‌ కూరపాటి వెంకటనారాయణ ప్రశ్నించారు. ఎన్డీఏ పాలకులకు తెలంగాణ ప్రజలు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెబుతారన్నారు.

Spread the love