ఆ మూడు రాష్ట్రాల్లో ఎన్నో సామీప్యతలు

ఆ మూడు రాష్ట్రాల్లో ఎన్నో సామీప్యతలు– యవసాయమే ప్రధాన జీవనాధారం
– కులాలు, మతాల ప్రాబల్యం అధికం
– కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే అధికార మార్పిడి
న్యూఢిల్లీ : నవంబర్‌లో శాసనసభ ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో మూడు హిందీ ప్రాంతాలే. ఈ రాష్ట్రాల్లో ఫలితాలను అనేక ప్రధాన అంశాలు ప్రభావితం చేస్తాయి. వీటిలో కులాలు-మతాల వారీగా జనాభా కూర్పు, ఆర్థిక పరిస్థితులు కూడా ఉన్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతుండగా వాటిలో ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లు హిందీ బెల్ట్‌లోనివి. ఈ రాష్ట్రాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు దాదాపుగా ఒకేలా ఉండడం విశేషం.
మన దేశంలోని మొత్తం కార్మికుల్లో 45.76% మంది వ్యవసాయం, అటవీ సంపద, చేపల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఎన్నికలు జరిగే హిందీ రాష్ట్రాల్లో ఇది యాభై శాతం పైనే ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో 62.61% మంది, రాజస్థాన్‌లో 54.79% మంది, మధ్యప్రదేశ్‌లో 59.78% మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడ్డారు. అరుణాచల్‌ ప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ వంటి చిన్న రాష్ట్రాలను మినహాయిస్తే వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలపై ఆధారపడిన కార్మికుల సంఖ్య ఈ రాష్ట్రాల్లోనే అధికంగా ఉంది. అయితే ఈ రాష్ట్రాల్లో వ్యవసాయోత్పత్తులకు మాత్రం విలువ చాలా తక్కువగా ఉంటోంది. ముఖ్యంగా సేవల రంగంతో పోలిస్తే వ్యవసాయోత్పత్తుల విలువ స్వల్పమే. సేవల రంగంలో పనిచేస్తున్న కార్మికుల జాతీయ సగటు 27.75% ఉంటే ఈ మూడు రాష్ట్రాల్లోనూ అది తక్కువగానే ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో సేవల రంగంలో కేవలం 18% మంది కార్మికులే పనిచేస్తున్నారు. దీనికంటే రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో కొంచెం మెరుగు. సేవల రంగంలో ఆరోగ్యం, సమాచారం, విద్య, రియల్‌ ఎస్టేట్‌, పాలనా సంబంధమైన సర్వీసులు ఉంటాయి.ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ భాఘెల్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌లు తమ రాష్ట్రాల్లో నిరుద్యోగ రేటు జాతీయ సగటు కంటే తక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు. రాజస్థాన్‌లో మాత్రం నిరుద్యోగ రేటు జాతీయ సగటు కంటే 1.20 శాతం పాయింట్లు ఎక్కువగా ఉంది. ఏ రాష్ట్రంలో అయినా కులాలు, మతాలే ఎన్నికల ఫలితాలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఎన్నికలు జరిగే హిందీ రాష్ట్రాలు దీనికి మినహాయింపు కావు. ఇటీవల జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలు హిందూత్వ వాదనను ముందుకు తెచ్చాయి. అయినప్పటికీ కులాల ప్రాధాన్యతను తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే దేశ చరిత్రలో అవి ఎప్పటి నుండే పాతుకుపోయి ఉన్నాయి. ఎన్నికలు జరిగే మూడు హిందీ రాష్ట్రాల్లోనూ హిందువుల జనాభాయే ఎక్కువ. ఈ మూడు రాష్ట్రాల జనాభాలో అత్యధికంగా 96.6% మంది హిందువులే. ఇక కులాల విషయానికి వస్తే ఛత్తీస్‌గఢ్‌ జనాభాలో 44.6% మంది ఓబీసీలు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కూడా ఓబీసీల జనాభా అధికంగానే ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ సాధారణ కేటగిరీ జనాభా తక్కువే. రాజస్థాన్‌లో ముస్లింలు అత్యధికంగా 7.8% మంది నివసిస్తున్నారు. ఎన్నికలు జరిగే మూడు హిందీ రాష్ట్రాల మధ్య మరో సామీప్యత ఉంది. అదేమంటే ఈ రాష్ట్రాల్లో రెండు పార్టీల మధ్యే అధికార మార్పిడి జరుగుతోంది. 2003 నుండి ఓటర్లలో 70%కి పైగా ఈ రెండు పార్టీలకే ఓట్లు వేస్తున్నారు. ఎన్నికల రంగంలో ఇతర పార్టీలు కూడా ఉన్నప్పటికీ కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నడుస్తోంది. ఇక మరో సామీప్యత విషయానికి వస్తే ఈ రాష్ట్రాల్లో 2003 నుండి శాసనసభలకు ఎన్నికైన మహిళల్లో సుమారు సగం మంది రిజర్వ్‌డ్‌ స్థానాల నుండి గెలిచిన వారే. ఉదాహరణకు ఛత్తీస్‌గఢ్‌ ఓటర్లు గత నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది మహిళల్ని ఎన్నుకోగా వారిలో 20 మంది రిజర్వ్‌డ్‌ స్థానాల నుండి గెలుపొందారు.

Spread the love