రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అంటూ వదంతులు

రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అంటూ వదంతులు– భారత్‌ గ్యాస్‌ ముందు భారీ క్యూ
– వదంతులు నమ్మొద్దు
– వినియోగదారులు ఈకేవైసీకి మాత్రమే రావాలి : భారత్‌ గ్యాస్‌ ఏజెన్సీ మేనేజర్‌ గోపాల్‌
నవతెలంగాణ – అచ్చంపేట రూరల్‌
కాంగ్రెస్‌ ఎన్నికలకు ముందు ప్రకటించినట్టు రూ.500కే సిలిండర్‌ ఇస్తున్నారన్న వదంతులతో వినియోగదారులు ఏజెన్సీ వద్ద బారులుతీరారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట పట్టణంలోని లక్ష్మీ ప్రసన్న భారత్‌ గ్యాస్‌ ఏజెన్సీ కార్యాలయం ముందు బుధవారం వినియోగదారులు పెద్దఎత్తున లైన్‌ కట్టారు. అయితే, వదంతులు నమ్మొద్దని, ఈకేవైసీ చేయించుకోవాల్సిన వారు మాత్రమే రావాలని భారత్‌ గ్యాస్‌ ఏజెన్సీ మేనేజర్‌ గోపాల్‌ సూచించారు. 500 రూపాయలకే సిలిండర్‌ ఇస్తున్నారన్న వదంతులను నమ్మి వినియోగదారులు ఇక్కడికి తరలివచ్చారని చెప్పారు. గత ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వినియోగదారులంతా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉందని, అదే తాము చెప్పామని అన్నారు. ఈ కేవైసీ ప్రక్రియకు ఇంకా సమయం ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈకేవైసీ చేయించుకోవాల్సిన వినియోగదారులు ఏజెన్సీ వద్దకు వచ్చేటప్పుడు ఆధార్‌ కార్డు తీసుకురావాలని సూచించారు.

Spread the love