లోపాలున్న కాలేజీలకు గుర్తింపు ఇచ్చేది లేదు

There is no recognition for defective colleges–  2,3 రోజుల్లో యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తాం
– ఇంజినీరింగ్‌ విద్యలో ప్రమాణాలు పెంచడమే లక్ష్యం
– కౌన్సెలింగ్‌ నాటికి అఫిలియేషన్ల ప్రక్రియ పూర్తి
– అన్ని కాలేజీల్లోనూ బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి : విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ కాలేజీల్లో లోపాలుంటే కఠినంగా వ్యవహరిస్తామనీ, అనుబంధ గుర్తింపు ఇచ్చేది లేదని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, జేఎన్టీయూహెచ్‌ ఇన్‌చార్జీ వీసీ బుర్రా వెంకటేశం చెప్పారు. లోపాలను సరిదిద్దుకుంటేనే అనుబంధ గుర్తింపు ఇస్తామని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో తనను కలిసిన విలేకర్లతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో కొన్నింటిలో ప్రిన్సిపాళ్లు లేరనీ, మరికొన్నింటిలో అధ్యాపకుల్లేరని చెప్పారు. కొన్ని కాలేజీల్లో ల్యాబ్‌లు, ఇతర వసతులు సరిగ్గా లేవని అన్నారు. లోపాలున్న కాలేజీలకు గుర్తింపు ఇస్తే ప్రమాణాలు ఎలా మెరుగవుతాయనీ, విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన విద్యార్థులు హోంగార్డులు, డాటాఎంట్రీ ఆపరేటర్లుగా మారితే ప్రయోజనం ఏముందని ప్రశ్నించారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులంటే ఉద్యోగాలు కల్పించే వారిలాగా మారాలనీ, ఉద్యోగాల కోసం ఎదురుచూడొద్దని అన్నారు. అందుకే కాలేజీల్లో ప్రమాణాలు పెంచడమే తమ లక్ష్యమన్నారు. ప్రమాణాలను పాటించిన కాలేజీలకే అనుబంధ గుర్తింపు ఇస్తామని చెప్పారు. ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియ నాటికి రాష్ట్రంలో అన్ని ఇంజినీరింగ్‌ కాలేజీలకు గుర్తింపు ప్రక్రియను పూర్తి చేస్తామని వివరించారు. లోపాలున్న కాలేజీ యాజమాన్యాలతో రెండు, మూడు రోజుల్లో సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు. లోపాలను సరిదిద్దుకోవాలనీ, విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని సూచిస్తామన్నారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, వృత్తి విద్యా కాలేజీలన్నింటిలో బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని తప్పనిసరిగా అమలు చేస్తామని అన్నారు. ఇందుకు సంబంధించి ఆదేశాలను జారీ చేస్తామన్నారు. పీహెచ్‌డీ అడ్మిషన్లపై పరిశీలిస్తామని చెప్పారు.

Spread the love