భూపరిపాలనలో మార్పు రావాలి

భూపరిపాలనలో మార్పు రావాలి– గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలి : డిప్యూటీ కలెక్టర్ల ఆత్మీయ సమ్మేళనంలో ప్రొఫెసర్‌ కోదండరామ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం భూపరిపాలనా వ్యవస్థలో సమూలమైన మార్పు తీసుకురావాల్సిన అవసరముందని ప్రొఫెసర్‌ కోదండరామ్‌ నొక్కిచెప్పారు. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలనీ, అక్కడే భూ సమస్యలను పరిష్కరించే విధానాన్ని తీసుకురావాలని సూచించారు. రెవెన్యూ ఉద్యోగులను దోషులుగా చూపెట్టి మాజీ సీఎం కేసీఆర్‌ అన్ని రకాల భూములను మాయం చేశాడని ఆరోపించారు. తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం ఆత్మీయ సమ్మేళనం బేగంపేటలోని ఓ హోటల్‌లో జరిగింది. కోదండరామ్‌ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం భూపరిపాలనలో తీసుకొచ్చిన మార్పులతో గ్రామాల్లో గందరగోళం నెలకొందన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాయలసీమ ప్యాక్షనిజం గ్రామాల్లో వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ..ఉద్యోగులుగా హక్కులను పొందుతూ ప్రజల హక్కుల కోసం పని చేయాలని సూచించారు. ప్రజలు ప్రశాంతంగా జీవించే విధంగా చేసే బాధ్యత రెవెన్యూ యంత్రాంగం చేతుల్లోనే ఉందన్నారు. కేసీఆర్‌ ఏనాడు కూడా ప్రజల కోణం నుంచి ఆలోచన చేయకపోవడంతోనే కొత్త రకమైన ఇబ్బందులు వచ్చాయన్నారు. మార్పు కోసం అందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. భూమి సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ..రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి భూ పరిపాలన వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. ఏపీలో గ్రామ స్థాయిలో 8 మంది ఉద్యోగులుండగా.. మన రాష్ట్రంలో ఒక్కరు కూడా లేరనీ, రవెన్యూ అధికారులకు అధికారాలు కూడా లేకుండా కేసీఆర్‌ చేశారని చెప్పారు. రెవెన్యూలో 124 చట్టాలుండగా.. అవి సైతం గందరగోళంగానే ఉన్నాయన్నారు. వీటిన్నింటిని కలిపి ఒకే చట్టం చేయాలని సూచించారు. భద్రమైన హక్కులను కల్పించేలా టైటిల్‌ గ్యారంటీ వంటి తేవాలన్నారు. తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. హక్కులను కాపాడుకుంటూనే ప్రజలకు సేవకులుగా పని చేద్దామని పిలుపునిచ్చారు. రెవెన్యూ వ్యవస్థలో చేయాల్సిన మార్పులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యలో వారధిలా పనిచేస్తామన్నారు.
తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం నూతన కమిటీ ఎన్నిక
తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులుగా వి.లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శలుగా కె.రామకృష్ణ, ఎన్‌.ఆర్‌.సరిత, సెక్రటరీ జనరల్‌గా రమేష్‌ రాథోడ్‌, కోశాధికారిగా కె.వెంకట్‌రెడ్డి, అసోసియేట్‌ ప్రెసిడెంట్స్‌గా ఎం.కృష్ణారెడ్డి, చిన్న వెంకటస్వామి, రమాదేవి, ఎం.జనార్ధన్‌రెడ్డి, ఎం.శ్రీనివాస్‌, ఉపాధ్యక్షులుగా పి.పద్మప్రియ, ఎన్‌.రాజేందర్‌రెడ్డి, షేక్‌ అమీద్‌, ఎం.విజయకుమారి, ఎల్‌.అలివేలు, కార్యదర్శులుగా ఎం.ప్రభాకర్‌, వి.శేఖర్‌రెడ్డి, జీఎన్‌వీ రాజువర్మ, ఈ.అర్చన, పి.రాంరెడ్డి, ఆర్గనైజింగ్‌ కార్యదర్శులుగా టి.శ్యాంప్రసాద్‌, కేఎంవీ జనార్ధన్‌రావు, కె.వీణా, కదం సురేష్‌, రాథోడ్‌ మోహన్‌సింగ్‌, డి.దేవుజ, కల్చరల్‌ సెక్రటరీలుగా భావయ్య, కె.సురేష్‌, వి.శ్రీదేవి, కార్యవర్గ సభ్యులుగా ఎస్‌.ఎల్లారెడ్డి, శ్రీరాందత్‌, ఆర్‌.గంగాధర్‌, అంబదాస్‌ రాజేశ్వర్‌, వై.శ్రీనివాస్‌రెడ్డి, టి.వెంకటేష్‌, డి.శ్రీధర్‌, దూలం మధు, కోమల్‌రెడ్డి ఎన్నికయ్యారు. స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌(విశ్రాంత) రవీంద్రబాబు ఎన్నికల ఇన్‌చార్జిగా వ్యవహరించారు.

Spread the love