బీజేపీ విధానాలపై సమరశంఖం కార్మిక, కర్షక ఐక్యపోరు షురూ..

Samarashankham worker and farmer united fight against BJP's policies..– కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్‌, మతతత్వ విధానాలపై నిరసన
– రాష్ట్రవ్యాప్తంగా ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల ర్యాలీ
– నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌
– మద్దతు ధరకు చట్టం చేయాలని నినాదాలు
– 16న దేశ్యాప్త బంద్‌
నవతెలంగాణ- విలేకరులు
కార్మికులు, కర్షకులు ఐక్యపోరుకు సమర శంఖం పూరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన గళం విప్పారు. సంయుక్త కిసాన్‌ మోర్చా, అఖిల భారత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ సంయుక్త పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలతో ర్యాలీలు చేపట్టారు. పెద్దఎత్తున రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు పాల్గొన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. పండిన పంట మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని నేతలు కోరారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె- గ్రామీణ భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని నినాదాలు చేశారు. లేబర్‌ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర అమలైనా లాభం రాదని, మద్దతు ధరకు చట్టం తేవాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయన్నారు. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధర నిర్ణయించాలన్నారు. ప్రభుత్వ బ్యాంకుల నుంచి స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ద్వారా రైతులకు రుణాలు ఇవ్వాలని కోరారు.
ఖమ్మం కాల్వొడ్డు నుంచి జెడ్పీసెంటర్‌ వరకు ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలతో ప్రదర్శన నిర్వహించారు. వ్యవసాయ రంగం సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్‌ అనుకూల వైఖరే కారణమని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం మీద ఆధారపడే రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు సంక్షోభంలో ఉన్నారని, వ్యవసాయాన్ని ఆధారం చేసుకుని వ్యాపారం చేస్తున్న వాళ్లు లాభాల్లో ఉన్నారని తెలిపారు. ఏటా పదివేల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, అవి పాలకులు చేస్తున్న హత్యలని ఆరోపించారు. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని ఎన్నికల ముందు మోడీ చెప్పి అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదన్నారు.
ఆదిలాబాద్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రాల్లో రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బైక్‌ ర్యాలీలు తీశారు. సంగారెడ్డిలోని ఐటీఐ నుంచి కలెక్టర్‌ ఆఫీస్‌ వరకు ట్రాక్టర్లు, బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనతంరం చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద సభ జరిపారు.
కార్మిక రైతు ప్రజావ్యతిరేక విధానాలను మానుకోవాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. రైతు చట్టాలపై కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని రైతు సంఘం ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలో ట్రాక్టర్‌, బైక్‌ ర్యాలీ నిర్వహించారు. నకిరేకల్‌ పట్టణంలో మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. చిట్యాల మండల కేంద్రంలో రైతు సంఘం, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ట్రాక్టర్‌, మోటార్‌ సైకిల్‌ ర్యాలీ తీశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో టాక్టర్స్‌, బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో, కోదాడ పట్టణంలో ట్రాక్టర్స్‌, ఆటో, మోటార్‌ సైకిళ్ల ర్యాలీ తీశారు.
కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మెలో, గ్రామీణ బంద్‌లో కార్మిక, కర్షక ఐక్యత చాటి కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని నేతలు పిలుపునిచ్చారు.పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో నిరసన తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ట్రాక్టర్లు, ఆటోలు, బైక్‌లతో ర్యాలీ తీశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో, నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో మోటార్‌ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

Spread the love