Thursday, June 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవారు దండుపాళ్యం నాయకులు

వారు దండుపాళ్యం నాయకులు

- Advertisement -

ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులపై బీఆర్‌‌నేత నేత కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు
కోటి ఎకరాల భూములను 22 ఏ కింద పెట్టారు
కేసీఆర్ రద్దు చేసిన భూమిశిస్తూ మళ్ళీ తెస్తారట..!
రేవంత్ రెడ్డి ఘరానా దొంగ.. శ్రీనివాసరెడ్డి గజదొంగ

​నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ 
ప్రతినిధి/ఖమ్మంరూరల్
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ఆగిపోయి అనేక అరాచకాలు నడుస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ‌రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిట్లర్ ఆదర్శమంటున్న రేవంత్ రెడ్డి.. వెలుగుమట్లలో రాక్షసుడి లాగా అర్ధరాత్రి వెయ్యి ఇండ్లు కూలగొట్టించారని అన్నారు. పేదలు రోడ్డున పడితే ముఖ్యమంత్రికి పైశాచిక ఆనందంగా అనిపిస్తుందన్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు దండుపాళ్యం నాయకులని విమర్శించారు. రెవెన్యూ మంత్రి అవినీతి సామ్రాజ్యం పెరిగిపోతోందని తెలిపారు. వ్యవసాయ మంత్రి అక్రమాలు రోజుకు ఒక్కటి బయటకు వస్తున్నాయన్నారు. ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్న కాంగ్రెస్ మళ్ళీ గెలవదన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఎదులాపురం మున్సిపాలిటీ వెంకటగిరిలోని హర్ష కన్వెన్షన్‌ ‌హాల్లో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎస్‌ఐఆర్‌‌పై శిక్ష‍ణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ‌మాట్లాడుతూ.. ఒక మంత్రి భూముల కబ్జాలకు పాల్పడుతుంటే, మరో మంత్రి వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టారన్నారు. ఇక ఆర్థిక మంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేశారని విమర్శించారు. కేసీఆర్ అప్పుల పాలు చేశాడని మాట్లాడుతున్నారని, రూ. లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టారని, సీతారామ 80 శాతం పూర్తి చేశారని చెప్పారు. కేసీఆర్ చేసిన అప్పులకు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సజీవ సాక్షాలుగా ఉన్నాయన్నారు. ఖమ్మంలో రెండు నర్సింగ్ కాలేజీలు, రెండు మెడికల్ కాలేజీలు కట్టించింది కేసీఆర్‌ అని అన్నారు.

​​కాంగ్రెస్ పాలనలో విధ్వంసం
​​విధ్వంసం తప్ప కాంగ్రెస్ నాయకులకు వికాసం తెలియదని కేటీఆర్ విమర్శించారు. యూరియా దుకాణం ముందు రైతులు నిలబడే దుస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్ రద్దు చేసిన భూమి శిస్తూ మళ్లీ విధిస్తామంటున్నారని చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమాలు పాలేరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలియాలన్నారు. వీడియో దృశ్యాలను సభా వేదికపై ప్రదర్శించారు. పొంగులేటి మోడీ కాళ్ళు పట్టుకున్నాడని, అందుకే ఈడీ దాడులపై కేసులు పెట్టలేదన్నారు. కోటి ఎకరాల భూములు 22ఏ కింద పెట్టారని తెలిపారు. అధికారం అడ్డుపెట్టుకుని వట్టినాగులపల్లిలో రైతులపై దాడులు చేసిండని అన్నారు. పాలేరులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గులాబీ జెండా ఎగురుతుందన్నారు. 20 లక్షల ఇండ్లు కడితేనే ఓటు అడుగుతామని చెప్పారని, మాట మీద నిలబడే దమ్ము ఉందా అని పొంగులేటిని ప్రశ్నించారు. ములుగు జిల్లాలో రూ. 12 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక దోపిడీకి పొంగులేటి శ్రీకారం చుట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

​​బూత్‌ల వారీగా బలమైన కమిటీలు
​రాష్ట్రంలో ఓటర్ లిస్టుల వడపోత కొనసాగుతోందని, ఎస్ఐఆర్ విషయంలో నిర్లక్ష్యం చేస్తే తీవ్ర నష్టం చోటుచేసుకుంటుందని కేటీఆర్ హెచ్చరించారు. సర్‌‌ను పట్టించుకోకపోతే తీవ్రంగా నష్టపోతామని హెచ్చరించారు. రాష్ట్రంలో 3.39 కోట్ల మంది ఓటర్లు, 35,985 పోలింగ్ బూత్‌‌లు ఉన్నాయన్నారు. ప్రతి పోలింగ్ బూత్‌‌కు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఒక బీఎల్ఏను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పాలేరు నియోజకవర్గంలో అనుమానాస్పదంగా 10 వేల ఓట్లు ఉన్నాయన్నారు. ఎంత పెద్ద నాయకుడైనా సొంత బూత్‌‌లో మెజారిటీ తీసుకొచ్చి చూపెట్టండని తమ పార్టీ నేతలకు సూచించారు. ఇప్పుడు కరెక్ట్ గా పని చేస్తేనే రేపు మంచి రోజులు వస్తాయన్నారు. పటిష్టమైన కమిటీ నిర్మాణం జరిగితేనే భవిష్యత్తు బాగుంటుందన్నారు. ​ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తక్కలపల్లి రవీందర్రావు, తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చ నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు లింగాల కమల్ రాజ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, దిండిగాల రాజేందర్, మరికంటి ధనలక్ష్మి, పాలేరు నియోజకవర్గ నాలుగు మండలాల పార్టీ మాజీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, భాషబోయిన వీరన్న, వున్నం బ్రహ్మయ్య, వేముల వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -