టికెట్లు తక్కువ అమ్మారంటూ బ్యానర్లు కట్టడమేంటి?

– మేడ్చల్‌ బస్‌డిపో మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలి: ఈయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బస్సులో ట్రావెల్‌ యాజ్‌ యూ లైక్‌ టికెట్లు తక్కువ అమ్మారనే కారణంతో హేళన చేస్తూ కండక్టర్ల ఫొటోలతో బ్యానర్‌ వేసి మేడ్చల్‌ బస్టాండులో అక్కడి మేనేజర్‌ కట్టించడాన్ని టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఆయనపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని రూట్లలో ఒకేలా టికెట్లు ఎలా అమ్ముడుపోతాయని ప్రశ్నించారు. సంఘీ టెంపుల్‌, రామోజీ ఫిలింసిటీ, వండర్‌ల్యాండ్‌, రామానుజాచార్యుల విగ్రహం, శంషాబాద్‌, జూపార్క్‌, ఎంజీబీఎస్‌, జూబ్లీ బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు టచ్‌ అయ్యే బస్సులలో ట్రావెల్‌ యాజ్‌ యూ లైక్‌ టికెట్లు ఎక్కువగా అమ్ముడుపోతాయని చెప్పారు. రాష్ట్రంలోని 97 డిపోల్లో అన్నీ నెంబర్‌వన్‌ స్థానంలో ఉంటాయా? అని ప్రశ్నించారు. ఎప్పుడైనా తక్కువ ఎర్నింగ్‌ తెచ్చే 10 డిపోలుంటాయని తెలిపారు. అలాంటప్పుడు కండక్టర్ల ఫొటోలతోనే బ్యానర్‌ ఎందుకు వేశారు? బస్‌భవన్‌ నుంచి ఏమైనా ఆదేశాలున్నాయా? అని ప్రశ్నించారు. ఒకవేళ అలా చేయాలని యాజమాన్యం చెబితే ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బస్‌భవన్‌ ముందు తక్కువ ఎర్నింగ్‌ తెస్తున్న 10 డిపోల మేనేజర్లు, 11 రీజియన్లలో చివరి మూడు రీజినల్‌ మేనేజర్లు, మూడు జోన్లలో తక్కువ ఎర్నింగ్‌ తీసుకొస్తున్న ఒక ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఫొటోతో బ్యానర్‌ కడితే ఆ బాధేంటో ఉన్నతాధికారులకు తెలుస్తుందని పేర్కొన్నారు.

Spread the love