ఈ ఓటమి ఓ సందేశం..

ఈ ఓటమి ఓ సందేశం..న్యూఢిల్లీ : ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ను ఆస్ట్రేలియా ఓడించిన విషయం తెలిసిందే. భారత్‌ ఓటమిపై క్రీడాభిమానులు ఎంతగానో కలత చెందారు. లీగ్‌ దశలో అన్ని మ్యాచ్‌లూ గెలిచి, మంచి జోష్‌ మీద ఉన్న భారత క్రికెట్‌ జట్టు ఫైనల్‌లో చతికిలపడడం విచారకరమే. ఈ నేపథ్యంలో భారత్‌ ఓటమిపై ఎన్నో వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. క్రికెట్‌ను ‘సర్జికల్‌ స్రైక్‌’ స్థాయికి తీసుకెళ్ళే వారికి ఈ ఓటమి ఓ సందేశాన్ని అందించింది. క్రీడను క్రీడగానే చూడాలని ఉద్బోధించింది. జాతీయతావాదం ముసుగులో హిందూత్వ భావాలు తలకెక్కిన కొందరికి మాత్రం ఈ ఓటమి ఏ మాత్రం రుచించడం లేదు. మన దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ మరే ఇతర క్రీడకూ లేదన్నది వాస్తవం. మన స్టార్‌ క్రికెటర్లు పలు కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరిస్తూ వారి ఉత్పత్తుల విక్రయానికి ఇతోధికంగా దోహదపడుతున్నారు. మన దేశంలో క్రికెట్‌ పేరుతో జరుగుతున్నది వ్యాపారమే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ దానికి కొందరు ‘దేశభక్తి’ అనే ముసుగు వేస్తున్నారు.
క్రికెట్‌ ఓ ఖరీదైన క్రీడ. జట్టు జయాపజయాలతో నిమిత్తం లేకుండా క్రీడాకారులు కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. మన దేశంలో పేదరికంతో అలమటిస్తున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. ఓ పూట తింటూ ఓ పూట పస్తులతో ఉంటూ అర్థాకలితో కాలక్షేపం చేస్తున్న వారు ఎందరో. ఇలాంటి భారతావనిలో విరాట్‌ కోహ్లీ కేవలం తన ఐపీఎల్‌ కెరీర్‌లో ఇప్పటికే అక్షరాలా రూ.126 కోట్లు సంపాదించాడు. ఇందుకు ఏ క్రికెటరూ మినహాయింపు కాదు. ఈ సంవత్సరం జరిగిన ఐపీఎల్‌ వేలంలో రోహిత్‌ శర్మ రూ.16 కోట్ల ధర పలికాడు. ఇండియా ఛేంజ్‌ ఫోరం అనే సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఎన్ని నియంత్రణలు, ఆంక్షలు ఉన్నప్పటికీ మన దేశంలో క్రికెట్‌ బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ మార్కెట్‌ గణనీయమైన వృద్ధి సాధించింది. ఈ సంవత్సరాంతానికి ఈ మార్కెట్‌ రెండు వందలక ఓట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. క్రికెట్‌ బెట్టింగ్‌లో దేశంలోని 34 కోట్ల మంది భాగస్వాములు కావడం మంచిదేనా అనేది మనం నిర్ణయించుకోవాల్సిన విషయం. పైగా వీరిలో యువత సంఖ్య అధికం. వారి శక్తి సామర్ధ్యాలు ఇలా బెట్టింగులు, గ్యాంబ్లింగులతో నీరుకారిపోతున్నాయి. క్రికెట్‌ క్రీడాకారులు దేశానికి బేషరతుగా సేవలు అందిస్తున్న దేశభక్తులని అనుకోవడం మూర్ఘత్వమే అవుతుంది. ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఓటమి చెందినప్పటికీ మన జట్టు రన్నర్‌-అప్‌గా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) నుండి సుమారు రూ.16 కోట్ల సొమ్ము పొందుతుంది. కార్గిల్‌లో విధులు నిర్వర్తించే జవాను వేతన స్కేలుతో దీనిని పోల్చి చూడండి. మన దేశంలో క్రికెట్‌ను రాజకీయ క్రీడగా మార్చేస్తున్న ఉదంతాలూ  కన్పిస్తున్నాయి. ఉదాహరణకు భారత్‌, పాకిస్తాన్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతుంటే టెలివిజన్‌ ఛానల్స్‌, ఇతర ప్రసార మాధ్యమాలు దానిని ఓ యుద్ధంగా పరిగణిస్తూ క్రీడాభిమానుల్లో జాతీయతావాదాన్ని రెచ్చగొడుతున్నాయి. ఇది ఎంత వికారమైందో మనం ఆలోచించాలి. ఈ క్రికెట్‌ పోరులో ‘జై శ్రీరామ్‌’ అనేది ఓ జపంగా మారిపోతోంది. ఇది మన అథోగతిని బయటపెడుతోంది. మన క్రూరమైన ఆలోచనలకు అద్దం పడుతోంది. ఆధ్యాత్మికతే లేని మతపిచ్చికి దర్పణంగా నిలుస్తోంది. క్రీడను క్రీడగా చూడలేని మన అసమర్థతను చాటిచెబుతోంది. ఓ పాకిస్తాన్‌ క్రీడాకారుడు సృజనాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే, దానిని ఎవరైనా మెచ్చుకుంటే అతనిపై జాతి వ్యతిరేకిగా ముద్ర వేయడం పరిపాటిగా మారిపోయింది. అలాంటప్పుడు భారత్‌, పాకిస్తాన్‌ దేశాలు క్రికెట్‌ ఆడుతుంటే జాతీయతావాదం పిచ్చి తలకెక్కడంలో ఆశ్చర్యమేముంది? అది చివరికి భౌతిక, సాంస్కృతిక దాడులకు కారణమైతే అందులో ఆశ్చర్యపడాల్సిన విషయమేముంటుంది?
భారత్‌, ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్ల మధ్య నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ని వీక్షించడానికి సాక్షాత్తూ ప్రధాని, కేంద్ర హోం మంత్రి హాజరయ్యారు. భారత్‌ విజయాన్ని కాంక్షిస్తూ దేశవ్యాప్తంగా పూజలు, హోమాలు, యజ్ఞాలు చేశారు. అయినా భారత్‌ విజయం ముంగిట బోర్లా పడింది. ఈ ఓటమి ఇచ్చే సందేశాన్ని అర్థం చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఏదైనా ఆ సమయంలో మన ప్రదర్శన మీద, పరిస్థితుల ప్రభావాల మీద ఆధారపడి ఉంటుంది తప్ప పూజలూ, పునస్కారాలు, మన ఆశలూ, ఆకాంక్షల మీద కాదు. ఈ రోజు నీవు హీరోవి కావచ్చు. రేపు జీరో అవచ్చు. అయినా మనం ఓటమిని అంగీకరించాల్సి ఉంది. అదేదో మూకుమ్మడి హిస్టీరియాతోనో లేక సిగ్గుచేటుగానో కాదు, క్రీడా స్ఫూర్తితో. కానీ, చివరికి జరిగిందేమిటి? ‘జాతీయతావాదం’ పేరిట పునీతమైన మన అహంకారం నీరుకారిపోయింది.
అందుకే ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో అనిజిత్‌ పాథక్‌ ”భారత దేశం ఓడిపోయినందుకు నాకేం బాధలేదు” అనే వ్యాసం రాశారు. ఆటల్లో గెలుపోటములు సహజం ‘క్వాడ్‌’ కూటమిలో ఆస్ట్రేలియా పక్కనే కూచున్న మన దేశం ఆస్ట్రేలియాతో యుద్ధం చేయలేదు. చేయదు కూడా. మనం ఆస్ట్రేలియాతో యుద్ధంలో ఓడిపోలేదు. గుండె పగిలే యువత, ఆత్మహత్యలకు పాల్పడే పిల్లలు ఆటని ‘స్పోర్టివ్‌గానే’ తీసుకోవాలి.

Spread the love