క్లీన్‌స్వీప్‌ కొడతారా?

Cleansweep?– ఊరిస్తోన్న 3-0 విజయం
– భారత్‌, ఆసీస్‌ మూడో వన్డే నేడు
– మ||1.30 నుంచి స్పోర్ట్స్‌18లో..
నవతెలంగాణ-రాజ్‌కోట్‌
ఆస్ట్రేలియాపై అరుదైన రికార్డుకు టీమ్‌ ఇండియా అడుగు దూరంలో నిలిచింది. వన్డే ఫార్మాట్‌లో ఆసీస్‌ ఇప్పటి వరకు భారత్‌ చేతిలో వైట్‌వాష్‌కు గురి కాలేదు. నేడు చివరి వన్డేలో నెగ్గితే.. ఆసీస్‌పై వన్డే సిరీస్‌ను రోహిత్‌సేన క్లీన్‌స్వీప్‌ చేయనుంది. విరాట్‌, రోహిత్‌, కుల్దీప్‌ రాకతో క్లీన్‌స్వీప్‌పై టీమ్‌ ఇండియా కన్నేయగా.. మాక్స్‌వెల్‌, కమిన్స్‌, స్టోయినిస్‌ రాకతో ఆసీస్‌ ఊరట విజయం ఆశిస్తోంది. భారత్‌, ఆస్ట్రేలియా మూడో వన్డే నేడు.
అక్టోబర్‌ 8న చెపాక్‌లో భారత్‌, ఆస్ట్రేలియా ప్రపంచ కప్‌ వేట షురూ చేయనున్నాయి. అంతకుముందు, నేడు రాజ్‌కోట్‌ వేదికగా ఈ రెండు జట్లు డ్రెస్‌ రిహార్సల్‌కు సిద్ధమయ్యాయి. భారత్‌, ఆసీస్‌ శిబిరాల్లో కీలక ఆటగాళ్లు జట్టులోకి తిరిగి రావటంతో.. వరల్డ్‌కప్‌ ప్రణాళికలు పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచే ఆరంభం కానున్నాయి. ఇక వరుసగా ఐదు మ్యాచుల పరాజయాలకు ఆసీస్‌ బ్రేక్‌ వేయాలని చూస్తుండగా.. కంగారూలపై తొలి క్లీన్‌స్వీప్‌ సిరీస్‌ సాధించాలని టీమ్‌ ఇండియా భావిస్తుంది. అభిమానులకు మరోసారి భారీ స్కోర్ల థ్రిల్లర్‌ ఎదురు చూస్తుండగా.. భారత్‌, ఆస్ట్రేలియా చివరి వన్డే పోరు నేడు.
ఆ నలుగురు దూరం
రాజ్‌కోట్‌ వన్డేకు నలుగురు ఆటగాళ్లు దూరమ య్యారు. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌, హార్దిక్‌ పాండ్య, శార్దుల్‌ ఠాకూర్‌ సహా అక్షర్‌ పటేల్‌ నేటి మ్యాచ్‌ సెలక్షన్‌కు అందుబాటులో లేరు. ఎడమ కాలు తొడ కండరం గాయంతో బాధపడుతున్న అక్షర్‌ పటేల్‌ పూర్తిగా కోలుకోలేదు. తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, కుల్దీప్‌ యాదవ్‌లు నేడు బరిలోకి దిగనున్నారు. గిల్‌ లేకపోవటంతో రోహిత్‌తో కలిసి ఇషాన్‌ కిషన్‌ ఓపెనింగ్‌ చేయనున్నాడు. జడేజా, అశ్విన్‌, కుల్దీప్‌ స్పిన్‌ త్రయం ఆసీస్‌ బ్యాటర్లపై మాయ చేయనుండగా.. బుమ్రా, సిరాజ్‌లు పేస్‌ బాధ్యతలు పంచుకోనున్నారు. శ్రేయస్‌ అయ్యర్‌, కెఎల్‌ రాహుల్‌, సూర్య కుమార్‌ యాదవ్‌ ఫామ్‌లో ఉండగా.. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలు నేడు తమదైన ఇన్నింగ్స్‌లు ఆడాలని చూస్తున్నారు. ఇక తొలి రెండు వన్డేల్లో మెప్పించిన అశ్విన్‌.. గత ఆరేండ్లలో రెండు వన్డేల్లోనే ఆడాడు. అయినా, స్వదేశంలో మెగా ఈవెంట్‌ ముంగిట అశ్విన్‌ను జట్టు మేనేజ్‌మెంట్‌ కోరుకుంటుంది. అక్షర్‌ పటేల్‌ ఫిట్‌నెస్‌ సాధించకపోతే.. అశ్విన్‌ నేరుగా ప్రపంచకప్‌ జట్టులోకి రానున్నాడు.
బౌలింగే సమస్య
ఆస్ట్రేలియా చివరి ఐదు వన్డేల్లో పరాజయం పాలైంది. దక్షిణాఫ్రికా మూడు, భారత్‌ రెండు మ్యాచుల్లో ఓడించాయి. ఈ ఐదు మ్యాచుల్లో నాలుగు సార్లు ఆసీస్‌ భారీగా పరుగులు సమర్పించుకుంది. 338, 416, 315, 399 స్కోర్లు నమోదయ్యాయి. భారత్‌ చేతిలో వైట్‌వాష్‌ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే మెరుగైన బౌలింగ్‌ ప్రదర్శనే శరణ్యం. డెత్‌ ఓవర్లలోనూ ఆసీస్‌ బౌలింగ్‌ ఆశాజనకంగా లేదు. 9.48 ఎకానమీతో కంగారూ బౌలర్లు తడబడుతున్నారు. ఈ ఓవర్లలో వికెట్ల వేటలోనూ ఆసీస్‌ వెనుకంజలోనే నిలిచింది. ఆ జట్టు స్ట్రయిక్‌రేట్‌ 20.60 మాత్రమే. మిచెల్‌ స్టార్క్‌, పాట్‌ కమిన్స్‌లు తుది జట్టులోకి రావటంతో నేడు పరిస్థితుల్లో మార్పు ఉంటుందని ఆసీస్‌ ఆశిస్తోంది. గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌ సైతం నేటి మ్యాచ్‌కు అందుబాటులో ఉన్నారు. టాప్‌ ఆర్డర్‌లో డెవిడ్‌ వార్నర్‌ ఒక్కడే ఫామ్‌లో ఉండగా.. స్మిత్‌, లబుషేన్‌ వేగం అందుకోవాల్సి ఉంది. కీలక ఆటగాళ్ల రాకతో ఇటు బ్యాట్‌తో, అటు బంతితో ఆస్ట్రేలియా మెరుగైన ప్రదర్శన చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది.
పిచ్‌, వాతావరణం
రాజ్‌కోట్‌లో పరుగుల వర్షం కురువనుంది. ఇక్కడ జరిగిన మూడు వన్డేల్లోనూ భారీ స్కోర్లు నమోదయ్యాయి. చివరగా 2020లో ఆసీస్‌పై భారత్‌ 340/6 పరుగులు చేయగా.. ఆసీస్‌ 304 పరుగులు చేసింది. నేటి మ్యాచ్‌లోనూ అదే తరహాలో భారీ స్కోర్లకు అవకాశం ఉంది. వాతావరణం కాస్త మేఘావృతమై ఉన్నప్పటికీ.. ఎటువంటి వర్షం సూచనలు లేవు.
తుది జట్లు (అంచనా)
భారత్‌ : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కెఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా.
ఆస్ట్రేలియా : మిచెల్‌ మార్ష్‌, డెవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌, అలెక్స్‌ కేరీ (వికెట్‌ కీపర్‌), గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌, మిచెల్‌ స్టార్క్‌, పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), ఆడం జంపా, జోశ్‌ హాజిల్‌వుడ్‌.

Spread the love