జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయనున్న గజ్యనాయక తాండ సర్పంచ్
నవతెలంగాణ – కామారెడ్డి, మాచారెడ్డి
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని గజ్యనాయక్ తాండ గ్రామంలో మహిళ సర్పంచ్ రావుల వినోద పై బెదిరింపులు, అవమానకర అసభ్యకరమైన మాటల ప్రవర్తన జరిగిందని శుక్రవారం గ్రామపంచాయతీ ముందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ కార్యాలయంకు డివిజన్ ఆఫీసర్ డిఎల్పిఓ శ్రీనివాస్, ఎంపీడీవో, ఎంపీఓ అధికారులు విచారణ జరుగుతుండగా 8వ వార్డు సభ్యులు తోకల కిషన్ తనపై దురుసుగా, అసభ్యమైన పదజాలము, బూతులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ అసభ్యకరంగా ప్రవర్తించారని, అతనికి మరో మిగతా 2, 4, 5, 6, 7, 9, 10 వార్డు సభ్యులు వత్తాసు పలకారని సర్పంచ్ రావుల వినోద ఆరోపించారు.
- ఈ ఘటనతో తన వ్యక్తిగత గౌరవం దెబ్బతిందని, ఎన్నికైన ప్రజా ప్రతినిధిగా విధులు నిర్వర్తించడంలో అడ్డంకులు ఏర్పడుతున్నాయని, లేనిపోని ఆరోపణలు చేశారని ఆమె తెలిపారు. ఈ విషయమై కామారెడ్డి జిల్లా ఎస్పీకి లిఖిత పూర్వక ఫిర్యాదు సమర్పిస్తానని తెలిపారు. తనను ఓర్వలేక ఇలా కక్ష సాధింపు చర్యలతో మానసికంగా ఇబ్బందికి గురి చేస్తున్నారు ఆరోపించారు. ప్రజా ప్రతినిధిగా తనకు రాజ్యాంగ పరిరక్షణలు ఉన్నాయని పేర్కొంటూ, ఈ ఘటనపై జాతీయ మహిళ కమిషన్ ను ఆశ్రయిస్తానట్లు తెలిపారు. డివిజన్, మండల అధికారులు ఉండగా అలా దురుసుగా ప్రవర్తించడం అసభ్య పదజాలం ఉపయోగించడం పట్ల గ్రామస్థాయిలో ప్రజా ప్రతినిధుల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం జరిగిందన్నారు.
- స్థానిక ప్రజలకు ఏలాంటి అవినీతి లేకుండా పాలన అందిస్తున్నామని, ఏదో అవినీతి జరిగినట్టు ప్రచారం చేయడం సరికాదన్నారు. మహిళలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని రంగాలలో సర్పంచ్ నుండి చట్టసభల వరకు మహిళలకు పెద్దపీట వేస్తుంటే, కాంగ్రెస్ పార్టీలోని కొందరు, బీఆర్ఎస్ వారితో జతకట్టి అయోమయం చేస్తూ, మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై జిల్లా అధికారులు స్పందించి పారదర్శక విచారణ చేపట్టాలని, గ్రామ ప్రజలకు నిజాలు వెల్లడించాలని ఆమె ఈ సందర్భంగా అధికారులను కోరారు.
- కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నా అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందించే విధంగా గ్రామ ప్రజలకు తమ వంతు కృషి ఉంటుందని ఆమె అన్నారు. ఎలాంటి అవకతవకలు లేకుండా స్వచ్ఛమైన గ్రామ పాలన అందించేందుకు కృషి చేస్తుంటే, ఎలాంటి అవినీతి లేకున్నా ఈరోజు ఏదో అవినీతి జరిగినట్లు కొందరు అపవాదులు సృష్టిస్తున్నారని అన్నారు. మహిళా సర్పంచ్ అని దుర్భాషలవడం సరికాదన్నారు. నిజాయితీ పాలనకు సహకరిస్తున్న ఉపసర్పంచిని సైతం దుర్భాషలాడారని, తనపై దుర్భసలాడిన వారిపై సర్పంచ్ రావుల వినోద జాతీయ మహిళా కమిషన్ కు, ఉప సర్పంచ్ లకావత్ బిక్షపతి ఎస్టీ కమిషన్ కు బాధ్యులపై ఫిర్యాదు చేయనున్నట్లు వారిరువురు తెలిపారు.



