పులకించిన ప్రకృతి జనసంద్రమైన ట్యాంక్‌బండ్‌

Excited nature A densely populated tankbund– అలరించిన కళాప్రదర్శనలు
– భారీ వర్షంలోనే తిలకించిన గవర్నర్‌, సీఎం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలకు ప్రకృతి పులకించింది….ఓవైపు త్రివర్ణ కాంతులీనుతున్న పాలనా సంస్కరణాలయం సచివాలయం… దానికి కుడివైపున తెల్లటి పాలరాళ్ల ధగధగలతో నౌబత్‌ పహాడ్‌ మీద కొలువైన బిర్లా మందిర్‌…ఎడమవైపు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ నిలువెత్తు శిలా విగ్రహం… ఆ ఎదురుగానే సంజీవయ్య పార్క్‌లో భారీ త్రివర్ణ పతాకం రెపరెపలు, ఎదురుగా ట్యాంక్‌బండ్‌…దాని మధ్యలో శాంతిమూర్తి తధాగత గౌతమ బుద్ధుని ప్రతిరూపం…దానికి ముందు భారీ వేదిక. తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకల కార్నివాల్‌ కోసం తరలివచ్చిన అశేష ప్రజానీకం. హాజరైన గవర్నర్‌ రాధాకృష్ణన్‌, ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా యావత్‌ యంత్రాంగం అక్కడే కొలువైంది. కళాకారుల డప్పు సప్పుళ్లు, రసరమ్య నాట్యవిలాసాలు, జానపద పదఘట్టనలు, అలరించే హావభావాలతో ఆద్యంతం ఆకట్టుకున్నాయి. స్వయం సహాయక గ్రూపుల మహిళలు ఏర్పాటు చేసిన హస్తకళలు, వస్త్రాలు, తినుబండారాల స్టాల్స్‌ ఆహూతులను ఆకర్షించాయి. పీ…పీ…అంటూ చిన్న పిల్లలు ఊదే బూరలను కుర్రాళ్లూ ఊదుతూ చేసిన హాడావిడి, అలజడి ముచ్చట గొలిపింది. సీఎం, గవర్నర్‌ వేదిక మీదకు రాగానే ప్రకృతి ఒక్కసారిగా పులకించి, వర్షం రూపంలో అందర్నీ తడిపి ముద్ద చేసి సంబురపడింది. ఆ వర్షంలోనే కళాకారులు తమ కళారూపాల్ని ప్రదర్శించారు. వేదికపైనున్న సీఎం, గవర్నర్‌, మంత్రుల చుట్టూ గొడుగులు వెలిసాయి. అంతటి భారీ వర్షంలోనూ వారు ఆసక్తిగా వేడుకలను తిలకించారు. జాతీయ పతాకాలు చేబూని శిక్షణా పోలీసులు నిర్వహించిన ‘ఫ్లాగ్‌ వాక్‌’ వర్షం కారణంగా ‘ఫ్లాగ్‌ రన్‌’గా మారింది. సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమైన వేడుకలను దాదాపు గంటసేపు వర్షంలోనే నిర్వహించారు. అతిధులు సంతోష సంబురంలో తడిసి ముద్దవుతూనే వీక్షించారు. ఆ పులకించిన ప్రకృతి వర్షధారలోనే ‘జయజయహే తెలంగాణ’ రాష్ట్ర గేయ రచయిత అందెశ్రీ, సంగీత దర్శకులు కీరవాణిని గవర్నర్‌, సీఎం సత్కరించారు. ఈ సందర్భంగా 12 నిముషాలు నిడివిగల పూర్తి గేయాన్ని సీఎం ఆవిష్కరించారు. కారు మబ్బులకు చిల్లుపడి భోరున కురుస్తున్న వర్షంలో ట్యాంక్‌బండ్‌ నీళ్ల మధ్యలోని బుద్ధుని విగ్రహం వద్దనుంచి పేల్చిన బాణాసంచా లయబద్ధ విన్యాస శబ్దాలు విచిత్ర అనుభూతుల్ని మిగిల్చాయి.

Spread the love