పంచ్‌ పడుద్ది!

– నేటి నుంచి మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌
– పసిడి రేసులో నిఖత్‌ జరీన్‌, లవ్లీనా బొర్గొహైన్‌
– భారత్‌ నుంచి పోటీలో 12 మంది బాక్సర్లు
నవతెలంగాణ-న్యూఢిల్లీ
74 దేశాలు, 350కి పైగా మేటి బాక్సర్లతో.. బాక్సింగ్‌ మహా సమరానికి రంగం సిద్ధమైంది. మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌ షిప్స్‌కు న్యూఢిల్లీలోని ఇంధిరాగాంధీ ఇండోర్‌ స్టేడియం ముస్తాబైంది. ముచ్చటగా మూడో సారి ఏబీఏ వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌కు ఆతిథ్యం ఇవ్వబోతున్న భారత్‌.. ఆతిథ్య దేశం ఈ సారి పసిడి పతకాలపై పంచ్‌ విసిరేందుకు రెఢ అవుతోంది. తెలంగాణ సూపర్‌స్టార్‌, యంగ్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌, ఒలింపిక్‌ పతక విజేత లవ్లీనా బొర్గొహైన్‌ ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో టీమ్‌ ఇండియా పసిడి ఆశలకు సారథ్యం వహించనున్నారు. మార్చి 15-26 వరకు మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌ జరుగనున్నాయి.
ఓ వైపు బహిష్కరణలు, మరోవైపు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) ఒత్తిడి.. ఈ రెండింట నడుమ పారిస్‌ 2024 ఒలింపిక్స్‌కు అర్హత టోర్నీగా పరిగణిస్తారా? లేదా? అనే సందిగ్ధం ఎటూ తేలకుండానే 2023 ఐబీఏ మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాం పియన్‌షిప్స్‌కు రంగం సిద్ధమైంది. నేడు న్యూఢిల్లీలోని ఇంధిరా గాంధీ ఇండోర్‌ స్టేడియంలో ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌ ఆరంభం కానున్నాయి. 2001లో ఆరంభమైన ఐబీఏ (ఏఐబీఏ) మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌కు ఆతిథ్యం ఇవ్వటం భారత్‌ కు ఇది మూడోసారి. వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌కు వేదికగా నిలిచే అవకాశం మరో దేశానికి మూడుసార్లు దక్కలేదు. టోర్నీ చరిత్రలో ఇదో రికార్డు!.
మనోళ్లు 12 మంది
మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో 12 విభాగాల్లో పసిడి పతకాలు అందుబాటులో ఉన్నాయి. ఆతిథ్య భారత్‌ 12 విభాగాల్లోనూ బాక్సర్లను బరిలోకి దింపుతోంది. ఒలింపిక్‌ మెడ లిస్ట్‌, రెండు సార్లు వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్‌తో పాటు వరల్డ్‌, కామన్‌వెల్త్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. యూత్‌ వరల్డ్‌ చాంపియన్‌ నీతూ (48 కేజీలు) తొలిసారి సీనియర్‌ విభాగంలో బరిలోకి దిగుతోంది. సాక్షి చౌదరి (52 కేజీలు), ప్రీతీ (54 కేజీలు), మనీశ (57 కేజీలు), జేస్మేన్‌ లాంబోరియ (60 కేజీలు), సాక్షి చోప్రా (63 కేజీలు), మంజు బంబోరియ (66 కేజీలు), సనంచ చాను (70 కేజీలు), లవ్లీనా బొర్గొహైన్‌ (75 కేజీలు), సవీటి బూర (81 కేజీలు), నుపుర్‌ షేరన్‌ (81 ప్లస్‌ కేజీలు) భారత్‌ తరఫున ఆడనున్నారు. తెలంగాణ సూపర్‌స్టార్‌ నిఖత్‌ జరీన్‌ 50 కేజీల విభాగంలో పంచ్‌ విసరనుంది.
నిఖత్‌, లవ్లీనాకు కొత్తగా!
సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో నిఖత్‌ జరీన్‌, లవ్లీనా బొర్గొహైన్‌ పసిడి ఫేవరేట్లుగా నిలిచారు. ఈవెంట్‌ జరుగుతున్న స్టేడియంలో నిఖత్‌ జరీన్‌, లవ్లీనా కటౌట్లు సందడి చేస్తున్నాయి. గత వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లో పసిడి నెగ్గిన నిఖత్‌ జరీన్‌, టోక్యో ఒలింపిక్స్‌లో పతకం దక్కించుకున్న లవ్లీనా బొర్గొహైన్‌లు ఈ ఏడాది కొత్త విభాగాల్లో పోటీ పడుతున్నారు. లవ్లీనా బొర్గొహైన్‌ ఒలింపిక్స్‌లో 66 కేజీల విభాగంలో పోటీపడింది. కానీ పారిస్‌ 2024 ఒలింపిక్స్‌లో మహిళల 69 కేజీల విభాగం తొలగించారు. ఇదే సమయంలో నిఖత్‌ జరీన్‌ పోటీపడే 52 కేజీల విభాగం సైతం ఒలింపిక్స్‌లో లేదు. నిఖత్‌ జరీన్‌ అందుకోసమే 50 కేజీల విభాగంలో పోటీపడుతుండగా.. లవ్లీనా బొర్గొహైన్‌ 75 కేజీల విభాగంలో పంచ్‌ విసరనుంది. కామన్‌వెల్త్‌ క్రీడల్లో నిఖత్‌ జరీన్‌ 50 కేజీల విభాగంలోనే పసిడి సొంతం చేసుకుంది. కానీ కామన్‌వెల్త్‌ పోటీ, వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పోటీ పూర్తి భిన్నం. రెండు కేజీలు బరువు తగ్గిన నిఖత్‌ జరీన్‌ పారిస్‌లో ఒలింపిక్‌ పతకమే లక్ష్యంగా చెమటోడ్చుతోంది. మరోవైపు లవ్లీనా కాస్త బరువు పెరిగి 75 కేజీల విభాగంలో పోటీపడేందుకు సై అంటోంది. వెయిట్‌ విభాగాల్లో మార్పుతో టెక్నికల్‌, ట్యాక్టికల్‌గా నిఖత్‌ జరీన్‌, లవ్లీనా బొర్గొహైన్‌లు పలు మార్పులు చేసుకోవాల్సి ఉంది. నిఖత్‌ జరీన్‌ పోటీపడే 50 కేజీల విభాగంలో బాక్సర్లు మెరుపు వేగంతో స్పందిస్తారు. కామన్‌వెల్త్‌ క్రీడల్లో నిఖత్‌ జరీన్‌ 50 కేజీల విభాగంలో అత్యంత బలమైన పంచ్‌లతో పాటు అత్యం వేగంగా ప్రత్యర్థులపై పంచ్‌లు సంధించిన బాక్సర్‌గా నిలిచింది. కామన్‌వెల్త్‌, వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లలో నాకౌట్‌ విజయాలతో పసిడి సాధించిన నిఖత్‌ జరీన్‌.. సొంతగడ్డపై అదే ప్రదర్శన పునరావృతం చేసేందుకు ఎదురు చూస్తోంది.
రూ.20 కోట్ల ప్రైజ్‌మనీ
ఐబీఏ మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌ చరిత్రలోనే అత్యధిక నగదు బహుమతి ఈ ఏడాది అందించనున్నారు. 12 విభాగాల్లో విజేతలకు రూ.20 కోట్ల నగదు బహుమతి ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ఏబీఏ, బిఎఫ్‌ఐ ప్రకటించాయి. పసిడి విజేతలకు రూ.10 కోట్లను ఇవ్వనుండా.. రజత, కాంస్య పతక విజేతలకు రూ. 5 కోట్ల చొప్పున అందించనున్నారు. 12 విభాగాల్లో బంగారు పతకం సాధించిన బాక్సర్‌ రూ.82 లక్షలు (1 లక్ష డాలర్లు), సిల్వర్‌ నెగ్గిన బాక్సర్‌ రూ.41 లక్షలు (50 వేల డాలర్లు), కాంస్య నెగ్గిన బాక్సర్‌ రూ.20 లక్షలు (25 వేల డాలర్లు) సొంతం చేసుకోనుంది. 2001లో ఏబీఏ మహిళల ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఆరంభమైన నాటి నుంచి ఇదే అత్యధిక నగదు బహుమానం.
బహిష్కరణ మరక
అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ)తో నెలకొన్న వివాదం, గత ఏడాది ఐబీఏ అధ్యక్ష ఎన్నికల ఫలితంగా ప్రపంచ బాక్సింగ్‌ సమాఖ్యలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి!. రష్యా ప్రతినిధి ఉమర్‌ క్రెమ్లెవ్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం (ఐబీఏ) అధ్యక్షుడిగా గత ఏడాది ఎన్నికయ్యారు. తాజా ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రష్యా, బెలారస్‌ బాక్సర్లు తమ జాతీయ ఫెడరేషన్‌ తరఫున బరిలోకి దిగుతున్నారు. దీంతో టోర్నీలో రష్యా జాతీయ పతాకం, జాతీయ గీతం వినిపిస్తాయి. దీనికి నిరసన వ్యక్తం చేస్తూ.. అమెరికా ఆధ్వర్యంలో పలు దేశాలు ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ను బహిష్కరించాయి. నెదర్లాండ్స్‌, స్విట్జర్లాండ్‌, ఐర్లాండ్‌, గ్రేట్‌ బ్రిటన్‌, కెనడా, స్వీడెన్‌, చెక్‌ రిపబ్లిక్‌, న్యూజిలాండ్‌, అమెరికాలు టోర్నీని బహిష్కరించిన జాబితాలో ఉన్నాయి. నెదర్లాండ్స్‌ వేదికగా సమాంతర ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌ను నిర్వహించేందుకు సైతం ఈ దేశాలు సిద్ధమవుతున్నట్టు న్యూజిలాండ్‌ బాక్సింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు అన్నాడు. 74 దేశాల నుంచి 350కి పైగా బాక్సర్లు న్యూఢిల్లీ వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లో పంచ్‌ విసరనున్నారు.
ఐఓసీతో పేచీ
అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ)తో అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం వివాదం కొనసాగుతూనే ఉంది. 2016 రియో ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌ బౌట్లను రిఫరీలు, న్యాయనిర్ణేతలు అవినీతి, ప్రలోభాలకు లోబడి నిర్ణయించారని ఐఓసీ స్వతంత్ర నివేదికలో నిగ్గు తేల్చింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌ పోటీల నిర్వహణ బాధ్యతలను అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘాన్ని (ఐబీఏ)ను తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రిఫరీలు, న్యాయ నిర్ణేతలు, పాయింట్ల కేటాయింపు, సమీక్ష పద్దతులు సహా అంశాల్లో వ్యవస్థాగత లోపాలను సరిదిద్దుకునేందుకు ఐబీఏకు ఐఓసీ పలు సూచనలు చేసింది. కానీ ఐబీఏ అవేవీ పట్టించుకోలేదు. దీంతో 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో సైతం బాక్సింగ్‌ పోటీలను నిర్వహణను స్వయంగా ఐఓసీ అధికారులే పర్యవేక్షించనున్నారు.
అర్హతపై పీటముడి
అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం (ఐబీఏ)పై ఐఓసీ నిషేధం కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో పారిస్‌ 2024 ఒలింపిక్స్‌ అర్హత ప్రక్రియపై ఇటీవల ఐబీఏ విడుదల చేసిన షెడ్యూల్‌ను ఐఓసీ తిరస్కరించింది. ఐబీఏ ప్రకారం మహిళల, పురుషుల ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ పారిస్‌ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించే టోర్నీలు. కానీ ఐఓసీ ఆసియా క్రీడలు, ఐదు కాంటినెంటల్‌ టోర్నీలు సహా రెండు ఓపెన్‌ క్వాలిఫయింగ్‌ ఈవెంట్లతో పారిస్‌ ఒలింపిక్‌ బెర్తులు తేల్చుతామని ప్రకటించింది. ఇటు ఐబీఏ, అటు ఐఓసీ ఒలింపిక్‌ అర్హత ప్రక్రియపై భిన్న ప్రకటనలు చేయటంతో బాక్సర్లు సందిగ్ధంలో పడ్డారు. ప్రతిష్టాత్మక ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ను ఒలింపిక్‌ అర్హత టోర్నీగా చేయకుంటే బాక్సర్లకు తీరని అన్యాయం జరుగుతుందని ఐబీఏ వాదిస్తోంది.
ఐఓసీ పరిశీలకుల రాక
ఐబీఏ, ఐఓసీ వివాదం కొనసాగుతుండగా.. మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) పరిశీలకుల బృందాన్ని పంపనుంది. ఈ మేరకు భారత బాక్సింగ్‌ సమాఖ్య తెలిపింది. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ జరిగే మార్చి 15-26 వరకు న్యూఢిల్లీలోనే ఉండనున్న ఐఓసీ పరిశీలకుల బృందం.. టెక్నికల్‌, న్యాయ నిర్ణేతలు, రిఫరీలు, ఇతర అంశాలను సునిశిత పరిశీలన చేయనుంది. ఐఓసీ పరిశీలకుల రాకను ఐబీఏ ఆఫీస్‌ బేరర్లు స్వాగతించారు.

Spread the love