Friday, June 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎప్పటికప్పుడు బిల్లుల చెల్లింపులు

ఎప్పటికప్పుడు బిల్లుల చెల్లింపులు

- Advertisement -

హాస్టల్ మరమ్మతులు నెలలో పూర్తి చేయాలి
హాస్టళ్లు, స్టడీ సర్కిళ్లు, ఓవర్సీస్ విద్యానిధిపై సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సంక్షేమమే ప్ర‌ధాన ల‌క్ష్యంగా ఇందిర‌మ్మ ప్ర‌జాప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్టంగా చెప్పారు. గురువారం హైదరాబాద్ లోని సచివాలయంలో భట్టి అధ్యక్షతన బీసీ, ఎస్సీ శాఖల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ప్రయివేటు భవనాల్లో వసతి పొందుతున్న విద్యార్థులను సాధ్యమైనంత మేరకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు మార్చే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాల్లో మరమ్మతులు ఒక నెలలోపు పూర్తి చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే 2023 నుంచి పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.7.5 కోట్ల మరమ్మతు బిల్లులను ప్రాధాన్యతతో క్లియర్ చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆయన సూచించారు. సంక్షేమ గురుకులాలు, హాస్టళ్ల రెంట్ ఛార్జీలు, డైట్, కాస్మోటిక్ ఛార్జీలకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ కు పంపాలని ఆయా శాఖ కార్యదర్శులకు ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు సంబంధించిన బిల్లులు ఏ కారణం చేతనైనా పంపక పోతే.. పరిణామాలు తీవ్రంగా ఉంటా యని హెచ్చిరించారు.

సంక్షేమ శాఖలకు సంబం ధించి పెండింగ్‌లో ఉన్న అన్ని బిల్లులను సమర్పిం చాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వాటిని వెంటనే ఆర్థిక శాఖ క్లియరెన్స్‌ చేస్తుందని తెలిపారు. అంబేద్కర్ టవర్, బాబూ జగ్జీవన్ రామ్ విద్యార్థి వసతి భవనాల నిర్మాణానికి సంభందించి నెలవారీ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆయన అదేశించారు. బహుళ అంతస్తుల అంబేద్కర్ భవనాన్ని 2027 ఏప్రిల్ 14న ప్రారంభించే లక్ష్యంతో ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. అన్ని స్వయం ఉపాధి కార్యక్రమాలను రాజీవ్ యువ వికాసం కింద అమలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రతిపాదిత ఈవీ ద్విచక్ర వాహన (స్కూటర్) పథకంకు సంభందించిన పూర్తి నివేదికను సమర్పించాలన్నారు. మెరుగైన ఆర్థిక ప్రణాళిక కోసం వార్షిక, త్రైమాసిక నిధుల అవసరాలను సమర్పించాలని తెలిపారు. అన్ని జిల్లాల్లో డా. బి.ఆర్. అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ల స్థాపనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకుంటూ బిల్లులను క్రమం తప్పకుండా సమర్పించి క్లియరెన్స్ పొందాలని ఆయా శాఖల కార్యదర్శులకు ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్వహణకు నెలకు రూ.29 కోట్ల నిధుల అవసరం ఉందని అధికారులు ఉప ముఖ్య మంత్రికి తెలిపారు. వివిధ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించిన పెండింగ్ చెల్లింపులు చేయాలని అధికారులు కోరారు. రూ.27 కోట్ల పెండింగ్ అద్దె చెల్లింపులను విడుదల చేయాలని కోరారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి విజయేంద్ర బొయి, శైలజ ఐఏఎస్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -