చరిత్రలో నిలిచేలా..

To be in history..– నేడు తుక్కుగూడ రాజీవ్‌గాంధీ ప్రాంగణంలో కాంగ్రెస్‌ విజయ భేరీ సభ
– వేదికపై సీడబ్ల్యూసీ సభ్యులు, అగ్రనాయకులు
– 50 ఎకరాల్లో సభ ప్రాంగణం, 100 ఎకరాల్లో పార్కింగ్‌, 5 ఎకరాల్లో మూడు సభావేదికలు
– 700 మంది పోలీసులతో భారీ బందోబస్తు
– టీపీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో కాంగ్రెస్‌ నిర్వహించే విజయభేరి సభ వేదిక కాంగ్రెస్‌ చరిత్రలోనే నిలిచిపోనుంది. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో సీడబ్ల్యూసీ, ఏఐసీసీ సభ్యులు ఒకే వేదికపై కూర్చున్న సందర్భాలు లేవు. ఈ అద్భుత ఘట్టానికి రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ రాజీవ్‌గాంధీ ప్రాంగణంలో నిర్వహించే విజయభేరి సభ వేదిక కానుంది. ఈ సభలో కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, యువ నేత రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ ఒకే వేదికపై కన్పించ నున్నారు. సుమారు 50 ఎకరాల్లో సభ ప్రాంగణం, వంద ఎకరాల్లో పార్కింగ్‌, ఐదెకరాల్లో మూడు సభావేదికలు ఏర్పాటు చేశారు. టీపీసీసీ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న ఈ సభకు భారీ సంఖ్యలో జన సమీకరణ చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అగ్ర నాయకులు సమాయత్తం చేశారు. ఈ సభ వేదికగా ఆరు గ్యారంటీలను సోనియా గాంధీ ప్రకటించనున్నారు. అవి ఏంటివి అనే దానిపై రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సీడబ్ల్యూసీ నేతలతో పాటు నలుగురు ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, పీసీసీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరైన సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర ముఖ్య నేతలకు శంషాబాద్‌ విమానా శ్రయంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, ఏఐసీసీ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, ఇతర సీనియర్‌ నాయకులు ఘనస్వాగతం పలికారు. వీరంతా ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రత్యేక బస్సులో ర్యాలీగా తుక్కుగూడ సభాస్థలికి చేరుకోనున్నారు. సభకు వచ్చే ముఖ్య నేతలకు దారి పొడవునా ఘన స్వాగతం పలకాలని పార్టీ నాయకులు నిర్ణయిం చారు. దీనికి తగ్గ ఏర్పాట్లు చేయాలని కింది స్థాయి నాయకులు ఆదేశాలు ఇచ్చారు.
5 ఎకరాల్లో వేదిక.. 500 మందికి అవకాశం
సభ ప్రాంగణంలో ప్రధానంగా మూడు వేదిక లు ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై సోనియా గాంధీ, రాహుల్‌, ప్రియాంక సహా హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌సింగ్‌ సుఖు, కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాజస్థాన్‌ ముఖ్య మంత్రి అశోక్‌ గెహ్లాట్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ భగేట్‌తో పాటు 84 మంది సీడబ్ల్యూసీ సభ్యులు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూర్చుంటారు. సభ ప్రాంగణానికి కుడి వైపున ఏర్పాటు చేసిన వేదికపై కేంద్ర మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు కూర్చోను న్నారు. ఎడమ వైపున ఏర్పాటు చేసిన మూడో వేదికపై డీసీసీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కళాకారులకు కేటాయించారు. ఈ మూడు వేదికల పై సుమారు 500 మందికి పైగా ముఖ్య నేతలు ఉంటారు. కార్యకర్తలకు సోనియా గాంధీ అభివాదం చేసేందుకు ప్రధాన వేదిక నుంచి మీడియా గ్యాలరీ వరకు సుమారు 600 ఫీట్ల పొడవు ర్యాంపు ఏర్పాటు చేశారు. వర్షానికి వేదిక కుంగిపోకుండా కింది భాగంలో కాంక్రీట్‌ వేశారు. సభా వేదికపై సోనియా, రాహుల్‌, ఖర్గే సహా తెలంగాణ నుంచి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌, సీఎస్పీ నేత భట్టి విక్రమా ర్కులు మాత్రమే ప్రసంగించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
సోనియాగాంధీని సన్మానించనున్న నాయకులు
ప్రత్యేక తెలంగాణ కలను సాకారం చేసిన సోనియాగాంధీ సభకు హాజరుకానున్న నేపథ్యంలో ఈ సభ వేదికపై పార్టీలకు అతీతంగా ఆమెను ఘనంగా సన్మానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ నాయకులు, విద్యార్థి సంఘాలు, జేఏసీ నాయకులు, పలు ఇతర పార్టీల నాయకుల ఆధ్వర్యంలో సోనియా గాంధీని సత్కరించనున్నట్టు కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు.
700 మందితో బందోబస్తు
సభ ప్రాంగణం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సభకు కాంగ్రెస్‌ ముఖ్య నేతలంతా హాజరు కానుండటంతో పోలీసులు అప్రమత్తమ య్యారు. ఇప్పటికే ఆ సభా ప్రాంగ ణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తుక్కుగూడకు వచ్చి, వెళ్లే నాలుగు ప్రధాన రహదారులపై భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు డీసీపీలు, ఐదుగురు అదనపు డీసీపీలు, ఎనిమిది మంది డీఎస్పీలు, 27 మంది సీఐలు, 61 మంది ఎస్‌ఐలు, 600 మంది కానిస్టేబుల్స్‌ విధులు నిర్వహించనున్నారు.

Spread the love