ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకే

To split the anti-government vote– ప్రధాని పర్యటనపై రేవంత్‌రెడ్డి వ్యాఖ్య
– బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే
– తెలంగాణకు భరోసా ఇవ్వని ప్రధాని
– ఆయన పర్యటన ఖర్చుతో పాలమూరు జిల్లానే అభివృద్ధి చేయొచ్చు
– కేసీఆర్‌ కుటుంబం అవినీతిపై మౌనమెందుకు అంటూ విమర్శలు
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనతో ప్రజలకు నిరాశే మిగిలిందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకే మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చారని విమర్శించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని చెప్పారు. మోడీ దేశానికి ప్రధాన మంత్రా? గుజరాత్‌కా? అని ప్రశ్నించారు. విభజన సందర్భంగా రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలపై ప్రధాని మోడీ భరోసా ఇవ్వలేదని విమర్శించారు.
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హమీలనే ప్రధాని నెరవేర్చలేదని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నాయకులతో కలిసి రేవంత్‌ విలేకర్లతో మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించకుండా, ఏదో కొత్తగా ఇస్తున్నట్టు పసుపు బోర్డును ప్రకటించారని విమర్శించారు. యూపీఏ హయాంలో తీసుకున్న నిర్ణయాలను సైతం ప్రధాని అమలు చేయలేదని చెప్పారు. గత ప్రభుత్వాలు ప్రజలకిచ్చిన హామీలను ఆపడం ఎంతవరకు సబాబు అని నిలదీశారు. మోడీ చేసిన మోసానికి డీకే అరుణ, జి. కిషన్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. మోడీ పర్యటన ఖర్చుతో పాల మూరు జిల్లాను అభివృద్ధి చేయొచ్చన్నారు. మోడీ సభకు పరోక్షంగా సహకరించిన కేసీఆర్‌ కూడా దోషినే అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియనే మోడీ తప్పుపట్టారనీ, అలాంటి వ్యక్తి సభను పాలమూరు జిల్లాలో నిర్వహించినందుకు డీకే అరుణ, జితేందర్‌రెడ్డి జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. భజన చేసుకునేందుకే బహిరంగ సభ పెట్టుకున్నారని విమర్శించారు. గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు కొత్త అంశాలు కాదని తెలిపారు.
తెలంగాణ పట్ల బీజేపీ సర్కారు వివక్ష
తెలంగాణ పట్ల ప్రధాని మోడీ వివక్ష చూపుతున్నారని రేవంత్‌ విమర్శించారు. రాష్ట్రానికి రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన మోడీ పర్యటనను కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. తెలంగాణకు ఉద్యోగ అవకాశాలు కల్పించే చర్యలు తీసుకుంటారని ఆశించాం. ఐటీఐఆర్‌ కారిడార్‌ను పునరుద్దరిస్తారని ఆశించాం. బయ్యారం ఉక్కు కర్మాగారంతోపాటు విభజన హామీలను అమలు చేస్తారని ఆశించాం.
వీటిలో ఏ అంశాలనూ ప్రధాని ప్రస్తావించలేదు’ అని అన్నారు. మాజీ ఎంపీలు జి. వివేక్‌, కొండా విశ్వేశ్వరరెడ్డి, విజయశాంతి, రాజ్‌గోపాల్‌ రెడ్డి అందుకే రాలేదనే చర్చ జరుగుతున్నదని తెలిపారు. మోడీ పర్యటన ఖర్చు కూడా పాలమూరుకు ఇవ్వలేదన్నారు. కల్వకుంట్ల కుటుంబ దోపిడీ గురించి మోడీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఇద్దరు ఏకమై చేస్తున్న పర్యటనలు చేస్తున్నారనీ, కేటీఆర్‌, హరీశ్‌రావు బిల్లా రంగాల్లా తిరుగుతున్నారని విమర్శించారు.
2004, 2009 కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోతో తాను వస్తానన్నారు. 2014,18 బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోలతో చర్చలకు వస్తారా? రెండు ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని బీఆర్‌ఎస్‌కు సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ పార్టీలో బహునాయకత్వం ఉంటే తప్పేంటి? అని రాష్ట్ర మంత్రులను ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాలకు అవకాశాలు ఇస్తే తప్పేముందన్నారు. ఓట్ల కోసమే కేటీఆర్‌ ఎన్టీఆర్‌ పేరును వాడుకుంటున్నారని విమర్శించారు.

Spread the love