బతుకింతేనా..!

– పంచాయతీ కార్మికుల అరణ్య రోదన
– క్యాబినెట్‌, అసెంబ్లీ సమావేశాల వైపు ఆశగా ఎదురుచూపు
– మల్టీపర్పస్‌ వద్దంటున్న జీపీ కార్మికులు
– కారోబార్లు, బిల్‌కలెక్టర్ల ప్రమోషన్లు కొలిక్కి వచ్చేనా!
– డిమాండ్లు నెరవేర్చే దాకా సమ్మెలోనే అంటూ అల్టిమేటం
– నేడు కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు
తెలంగాణ పల్లెలకు గ్రామపంచాయతీ కార్మికులే బ్రాండ్‌ అంబాసీడర్లు. ఊరి కంపునంతా భరిస్తూ శుద్ధి చేస్తున్నారు. మనఊర్లకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తున్నారు. అవార్డులు వచ్చేలా కష్టపడుతున్నారు. చుట్టపోడు చచ్చినా..పండుగొచ్చినా..పబ్బమొచ్చినా ఊరు మొఖం చూసి సెలవులు తీసుకోకుండా శ్రమిస్తున్నారు. ఇంత చేస్తున్నా వాళ్ల కష్టాన్ని పాలకులు గుర్తించడం లేదు. ప్రభుత్వ, కాంట్రాక్టు ఉద్యోగులకు పీఆర్సీ కింద 30 శాతం వేతనాలు పెంచిన రాష్ట్ర సర్కారు జీపీ కార్మికులకు మాత్రం వెయ్యి రూపాయల వేతనం పెంచి గొప్పలు చెప్పుకుంటున్నది. 90 శాతం నిరక్షరాస్యులు..ఆపై దళితులు అయినందువల్లో ఏమోగానీ వారిని చిన్నచూపే చూస్తున్నది. తమ న్యాయమైన కోర్కెలను నెరవేర్చాలని సమ్మె చేస్తుంటే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. బెదిరిస్తున్నది. సమ్మెలో భాగంగా సోమవారం కలెక్టరేట్ల ముట్టడికి జేఏసీ పిలుపునిచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో క్యాబినెట్‌ జరుగుతుండటంతో తమ పట్ల రాష్ట్ర సర్కారు సానుకూలంగా స్పందిస్తుందని కొండంత ఆశతో గ్రామపంచాయతీ కార్మికులు ఎదురుచూస్తున్నారు. వారి ఆశల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంత వరకు నెరవేరుస్తుందో చూడాలి.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో 12769 గ్రామపంచాయతీ లున్నాయి. అందులో ప్రభుత్వ లెక్కల ప్రకారం 36,500 మంది పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.8,500 వేతనం ఇస్తున్నది. మేడే సందర్భంగా వెయ్యి రూపాయలు పెంచింది. అయితే, వాస్తవానికి గ్రామాల్లో పంచాయతీ కార్మికుల సంఖ్య 50 వేల వరకు ఉంది. ప్రభుత్వం మాత్రం అధికార లెక్కల ప్రకారమే వేతనాలు ఇస్తున్నది. దీంతో ఆ వేతనాలనే క్షేత్రస్థాయిలోని కార్మికులందరూ పంచుకుంటున్నారు. దీంతో వారికి నెలకు నాలుగైదు వేల రూపాయలకు మించి రావడం లేదు. ఈ అరకొర వేతనాలతో బతకలేకనే పంచాయతీ కార్మికులు సమ్మెలోకి దిగారు.
మల్టీపర్పస్‌ విధానం రద్దు చేయమంటున్నారు…
గతంలో ప్రతి ఊరిలోనూ సఫాయి కార్మికులు, చెత్త సేకరించేవారు, వాటర్‌మెన్లు, ఎలక్ట్రీషియన్లు, కారోబార్లు, బిల్‌ కలెక్టర్లుండేవారు. ఎవరి పని వారే చేసేవారు. ప్రస్తుతం మల్టీపర్పస్‌ విధానంలో అన్ని పనులనూ కార్మికులతోనే చేయిస్తున్నారు. దీంతో వారు ప్రమాదాలకు గురై చనిపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పారిశుధ్య కార్మికుడ్ని బలవంతంగా విద్యుత్‌ స్తంభం ఎక్కించగా కరెంట్‌ షాక్‌కు గురై మరణించిన విషయం విదితమే. నల్లగొండ జిల్లా వేములపల్లి, మిర్యాలగూడ, సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలాల్లో ట్రాక్టర్‌ డ్రైవింగ్‌ పట్ల అనుభవం లేక కార్మికులు చనిపోయిన విషయం తెలిసిందే.
ఇలా రాష్ట్రంలో 200 మందికిపై పంచాయతీ కార్మికులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఆ కుటుంబాలన్నీ నేడు రోడ్డున పడ్డాయి. గతంలో ఆత్మగౌరవంతో బతికిన కారోబార్లు, బిల్‌కలెక్టర్లు నేడు మల్టీపర్పస్‌ విధానంతో చెత్తసేకరిస్తున్నారు. మోరీలు తీస్తున్నారు. కొత్తగా పాఠశాలలు, ఐసీడీఎస్‌ కేంద్రాలు, గ్రంథాలయాలు ఊడ్చటం, మరుగుదొడ్లు కడగటం వంటి పనులను జీపీ కార్మికులకే అంటగట్టారు. అందువల్ల ‘ఏ శాఖలోనూ లేని మల్టీపర్పస్‌ విధానం మాకెందుకు? రద్దు చేయండి’ అని జీపీ కార్మికులు చేస్తున్న డిమాండ్‌ న్యాయసమ్మతమైనదే.
సామాజిక భద్రత అడగటం నేరమా?
చెత్తసేకరణ, మోరీలు తీయడం వంటి రోజువారీ విధులతో జీపీ కార్మికులు తరుచూ రోగాలపాలవుతున్నారు. సొంత ఖర్చులతోనే వైద్యం చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తమకు ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. గతంలో జానారెడ్డి పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో వారికి పీఎఫ్‌, ఈఎస్‌ఐ అమలు చేస్తూ సర్క్యూలర్‌ జారీ చేశారు. కానీ, క్షేత్రస్థాయిలో అమల్లోకి రాలేదు. 2015లో సమ్మె సందర్భంగా పీఎఫ్‌, ఈఎస్‌ఐ అమలు చేస్తామని మంత్రి కేటీఆర్‌ హామీనిచ్చారు. ఎనిమిదేండ్లవుతున్నా అతీగతీ లేదు. మండలాన్ని యూనిట్‌గా తీసుకుని తమకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ అమలు చేయాలని కార్మికులు కోరుతున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రకటించిన ఎస్‌కేడే పథకం ఒకటుందనే విషయమే చాలా మంది కార్మికులకు తెలియదు. కార్మికులు తమకు పోస్టల్‌ ఇన్సూరెన్స్‌ కింద ఏటా రూ.399 ప్రీమియం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. కార్మికులు సహజ మరణం పొందితే రూ.5 లక్షలు, ప్రమాదాల్లో మరణిస్తే రూ.10 లక్షల సహాయం ఆ పథకం కింద ఇచ్చే వెసులుబాటు అందులో ఉంది. దీనికి ఏటా కోటిన్నర రూపాయలు కేటాయిస్తే జీపీ కార్మికులందరికీ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించొచ్చు. ఏటా లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌ ప్రవేశపెట్టే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అమౌంట్‌ పెద్ద మొత్తమేమీ కాదు.
దశాబ్దాలుగా పనిచేస్తున్నారు..పర్మినెంట్‌ చేస్తే తప్పేంటి?
రాష్ట్ర ప్రభుత్వం ఆయా రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్లను పర్మినెంట్‌ చేసిన విషయం విదితమే. పంచాయతీ కార్మికులు దశాబ్దాల తరబడి వంశపారంపర్యంగా పనిచేస్తున్నారు.
ఎవ్వరూ చేయడానికి ముందుకు రాని పనిని భరిస్తూ చేస్తున్న తమని కూడా పర్మినెంట్‌ చేయాలని కోరుతున్నారు. వారి డిమాండ్‌ ఏ కోశాన చూసినా న్యాయ సమ్మతమైనదే. అన్ని అర్హతలున్న తమను సహాయకార్యదర్శులుగా నియమించాలని కారోబార్లు, బిల్‌కలెక్టర్లు డిమాండ్‌ చేస్తున్నారు. డిగ్రీ, ఇంటర్‌ చదివిన వారి కోరికా న్యాయమైనదే.
సమాన పనికి సమాన వేతనమే అడుగుతున్నరు కదా!
జీవో 60 ప్రకారం మున్సిపాల్టీల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.16,500, కారోబార్లు, బిల్‌కలెక్టర్లు, ఎలక్ట్రీషియన్లు, పంపు ఆపరేటర్లకు రూ.19 వేల వేతనాన్ని ఇస్తున్నది. మున్సిపాల్టీల్లోనూ, పంచాయతీల్లోనూ కార్మికులు చేసే పని ఒక్కటే. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనమైనా చెల్లించాలని వారు అడుగుతున్నారు. లేదంటే పీఆర్సీ నివేదిక చెప్పినట్టుగా తమకు కనీస వేతనం ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పుడిస్తున్న వేతనాల సొమ్ముకు అదనంగా మరో రూ. 32 కోట్లు కేటాయించి ట్రెజరరీ ద్వారా చెల్లిస్తే వారి వేతన డిమాండ్‌ పరిష్కారమవుతుంది. సబ్బులు, పరికరాలు, చీపర్లు, ఇతరత్రా అవసరాల కోసం కూడా జీపీల నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరుతున్నారు.
వెనుకబడినోళ్లు కాబట్టే..
– గ్రామ పంచాయతీ కార్మికులు, ఉద్యోగుల జేఏసీ చైర్మెన్‌ పాలడుగు భాస్కర్‌
పంచాయతీ కార్మికులు వెనుకబడ్డోళ్లు, చదువురానోళ్లు అని రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఈ ధోరణి సరిగాదు. వెంటనే చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలి. ఇవి తమ వల్ల అవుతాయి. మిగిలినవి భవిష్యత్‌లో పరిష్కరిస్తాం అని సర్కారు చెబితే సరిపోతుందికదా? ఈ నాన్చివేత ధోరణి ఎందుకు? ఉద్యోగులందరికీ వేతనాలు పెంచారు మంచిదే. మేమేమీ వద్దనట్లేదు. పంచాయతీ కార్మికులకు వెయ్యి రూపాయలు పెంచి మేం పెంచాం..మేం పెంచాం అని సీఎం, మంత్రి చెప్పుకోవటం ఏం బాగోలేదు. పీఆర్సీ నివేదిక చెప్పిన కనీస వేతనం పంచాయతీ కార్మికులకు కూడా వర్తింపజేయాలి కదా. జీపీ కార్మికులను పర్మినెంట్‌ చేయాలి. మల్టీపర్పస్‌ విధానం రద్దు చేయాలి. కారోబార్లు, బిల్‌కలెక్టర్లకు ప్రమోషన్లు కల్పించాలి. ఈ డిమాండ్లను నెరవేర్చేదాకా పోరాటం కొనసాగుతుంది.

Spread the love