కనీస మద్దతు ధరల కోసం నేడు, రేపు ఆందోళనలు

For minimum support prices Concerns today and tomorrow– తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి సాగర్‌ పిలుపు
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్‌
కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరల చట్టం చేయాలని కోరుతూ సోమ, మంగళవారాల్లో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్‌ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో సీనియర్‌ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు పి. జంగారెడ్డి, అరిబండి ప్రసాదరావుతో కలిసి ఆయన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా సాగర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పంటల మద్దతు ధరలు సహేతుకంగా లేవన్నారు. పెరుగుతున్న రైతుల పెట్టుబడిని పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. వెంటనే ఆ ధరలను సవరించాలని డిమాండ్‌ చేశారు. అందుకోసం అన్ని జిల్లా, మండల కేంద్రాలు, గ్రామాల్లో నిరసనలు తెలియజేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. గతేడాది నిర్ణయించిన ధరలపై 5 నుంచి 7 శాతం మాత్రమే పెంచారని తెలిపారు. అదే సందర్భంలో వ్యవసాయోత్పత్తి ఖర్చులు 20 నుంచి 22 శాతం పెరిగాయన్నారు. ‘వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులను తగ్గించి చూపి, దానికి 50 శాతం కలిపి ధరలు ప్రకటించింది. ధరల నిర్ణయాక కమిషన్‌ రికమండేషన్లను ప్రధాని నేతృత్వంలోని క్యాబినెట్‌ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ తరహాలో రాష్ట్రంలో ‘ధరల నిర్ణయాక కమిషన్‌’ (సీఏసీపీి) వేసి రాష్ట్రంలో పండే అన్ని పంటలకు మద్దతు ధరలను నిర్ణయించి అమలు చేయాలి. కూరగాయలతోపాటు పండ్లకు కూడా మద్దతు ధరలను నిర్ణయించాలి. దీంతో నిర్ణయించిన ధరలను అమలు జరపడం రైతులకు వీలు అవుతుంది’ అని సూచించారు. ధరలు నిర్ణయించడంతోపాటు నిర్ణయించిన ధరలను అమలు జరిపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా అన్ని పంటలకు బోనస్‌ ఇవ్వాలని కోరారు.

Spread the love