నేడు గురుపూజోత్సవం

teachers day– ముఖ్య అతిధిగా సీఎం కేసీఆర్‌
– 126 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అందులో భాగంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో మంగళవారం ఉదయం 10 గంటలకు గురుపూజ్సోవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరవుతారని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్‌ విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఎ శ్రీదేవసేన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి సభాధ్యక్షులుగా వ్యవహరించనున్న ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డితోపాటు విశిష్ట అతిథులుగా శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు గౌరవ అతిథులుగా పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2023కు 126 మందిని ప్రభుత్వం ఎంపిక చేసింది. వారికి గురుపూజోత్సవం సందర్భంగా మంగళవారం వారికి అవార్డులను ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా వారిని సన్మానించడంతోపాటు రూ.10 వేల నగదు, ప్రశంసాపత్రం, శాలువా, బంగారుపూత పూసిన రజతపతకాన్ని అందజేస్తారు.
ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు
ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల్లో క్రమశిక్షణను, జ్ఞానాన్ని పెంపొందించి లక్ష్యం పట్ల స్పష్టమైన అవగాహనను కలిగించి వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ’అనే సూక్తి తల్లిదండ్రుల తర్వాత గురువుకున్న ప్రాధాన్యతను తెలియజేస్తుందని వివరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల సంక్షేమానికి, అభివృద్ధికి సమర్థవంతమైన కార్యాచరణను అమలు చేస్తున్నదని తెలిపారు. గురుకుల విద్యలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. నాణ్యమైన విద్యను అందిస్తూ రేపటితరాన్ని తీర్చిదిద్దడంలో ముందంజలో ఉందని వివరించారు. గుణాత్మక విద్యను అందిస్తూ చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ సత్ఫలితాలను ఇస్తున్నదని తెలిపారు. తాము చేపట్టిన ఈ విధానాలతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు చదువుల్లోనూ, క్రీడల్లోనూ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని ప్రపంచానికి చాటుతున్నారని పేర్కొన్నారు. విద్యారంగ ప్రగతి పట్ల ప్రభుత్వానికున్న అంకితభావానికి, చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని వివరించారు.
విద్యార్థులకు భవిష్యత్‌నిచ్చేది గురువు : మంత్రి సబిత
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రులు జన్మనిస్తే వారికి భవిష్యత్‌ నిచ్చేది గురువు అని మంత్రి పేర్కొన్నారు. భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతూ ఉపాధ్యాయులు గురుతర భాధ్యతను నిర్వహిస్తున్నారని వారి సేవలను కొనియాడారు. విద్య ద్వారానే మానవ వనరులు అభివృద్ధి చెందుతాయనీ, మానవ వనరుల ద్వారానే బంగారు తెలంగాణ సాధించొచ్చనే గొప్ప లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక గురుకులాలు పెట్టి, నాణ్యమైన విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల సంక్షేమం, అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయని మంత్రి తెలిపారు.

Spread the love