– ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
– 80 శాతం ఓటింగ్ నమోదు
– ఎస్‌ఎఫ్‌ఐ-ఏఎస్‌ఏ-టీఎస్‌ఎఫ్ : కూటమికే విజయావకాశాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) విద్యార్థి సంఘ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. హెచ్‌సీయూ ప్రాంగణంలో గురువారం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 5,300 ఓట్లున్నాయి. అందులో 4,240 (80 శాతం) మంది విద్యార్థులు ఓటు హక్కు వినియోగించుకున్నట్టు విశ్వవిద్యాలయ అధికారులు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, సాంస్కృతిక కార్యదర్శి, క్రీడల కార్యదర్శి పోస్టులకు ఎన్నికలను నిర్వహించారు. వాటితోపాటు స్కూల్ బోర్డు సభ్యులు, స్కూల్ కౌన్సిలర్లు, అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) ప్రతినిధుల పోస్టులకు పలువురు పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఎస్‌ఏ, టీఎస్‌ఎఫ్ కూటమి, ఏబీవీపీ కూటమి, ఏఐఓబీసీఎస్‌ఏ, ఏఐఎస్‌ఏ, బీఎస్‌ఎఫ్, డీఎస్‌యూ కూటమి, ఎన్‌ఎస్‌యూఐ కూటమి పోటీ చేశాయి. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఎస్‌ఏ, డీఎస్‌యూ, టీఎస్‌ఎఫ్ కూటమి నుంచి అధ్యక్షులుగా ఎండీ అతీక్ అహ్మద్, ఉపాధ్యక్షులుగా జల్లి ఆకాశ్, ప్రధాన కార్యదర్శిగా దీపక్‌కుమార్ ఆర్య, సంయుక్త కార్యదర్శిగా లావుడి బాల ఆంజనేయులు, సాంస్కృతిక కార్యదర్శిగా షమీమ్ అక్తర్ షేక్, క్రీడల కార్యదర్శిగా అతుల్ పోటీ చేశారు. ఏబీవీపీ కూటమి నుంచి అధ్యక్షులుగా షేక్ ఆయేషా, ఉపాధ్యక్షులుగా తరుణ్, ప్రధాన కార్యదర్శిగా రాజేశ్ పిల్లా, సంయుక్త కార్యదర్శిగా రాథోడ్ వసంత్ కుమార్, సాంస్కృతిక కార్యదర్శిగా ఆంటోని బసుమతారి, క్రీడల కార్యదర్శిగా జ్వాలా ప్రసాద్ పోటీలో చేస్తున్నారు. ఎస్‌ఎఫ్‌ఐ కూటమి, ఏబీవీపీ కూటమి మధ్యే ప్రధాన పోటీ ఉన్నది. దీంతో ఈ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఎస్‌ఏ, టీఎస్‌ఎఫ్ కూటమికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది.