నేడు కొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభం

– ఉదయం ఏడుగంటలకు కార్యక్రమం
న్యూఢిల్లీ : నూతన పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవం నేడు జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రారంభించనున్నారు. పార్లమెంటులోని మహాత్మాగాంధీ విగ్రహం సమీపంలో ఏర్పాటుచేసే మందిరంలో సంప్రదాయ పూజలు, హోమంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇందులో ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యుటీ చైర్మెన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌, మాజీ ప్రధాని హెచ్‌ డి దేవగౌడ, సీనియర్‌ మంత్రులు పాల్గొంటారు. పూజా కార్యక్రమాలు పూర్తికాగానే అందరూ కలిసి లోక్‌సభ, రాజ్యసభ ప్రాంగణాలను పర్యవేక్షిస్తారు. ఉదయం ఏడింటికి హౌమం, ఆ తరువాత సర్వ మత ప్రార్థనలు జరుగుతాయి. ఉదయం 9:30 గంటల కల్లా తొలి విడత ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తవుతుంది. అనంతరం హౌమం వేదిక వద్దే తమిళనాడు తంజావూరు శైవ మఠ పెద్దలు చోళుల రాజదండమైన సెంగాల్‌ని ప్రధాని నరేంద్ర మోడీకి అందజేస్తారు. లోక్‌సభ ఛాంబర్‌లో స్పీకర్‌ కుర్చీ వద్ద రాజదండాన్ని (సెంగాల్‌) ప్రతిష్ఠిస్తారు. మధ్యాహ్నం రెండో విడత కార్యక్రమం మొదలవుతుంది. మధ్యాహ్న కార్యక్రమంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ ప్రసంగం ఉంటుంది. రాజ్యసభ చైర్మన్‌ జగ్దీప్‌ ధన్‌కర్‌ తరపున అభినందన సందేశాన్ని ఆయన చదివి వినిపిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లిఖితపూర్వక సందేశాన్ని కూడా ఇదే సందర్భంగా సభలో వినిపిస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రూ.75 నాణేన్ని, ఒక స్మారక తపాలా బిళ్లను ప్రధానమంత్రి విడుదల చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే 20 పార్టీలు బహిష్కరించాయి. ఈ కార్యక్రమంలో ఎన్డీఎ భాగస్వామ్య పక్షాలతో పాటు వైసీపీ, టీడీపీ, ఎస్‌ఏడీ, జేడీఎస్‌, బీఎస్పీ తదితర పార్టీలు పాల్గొంటాయి.దేశాధ్యక్షురాలు ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షుడు జగదీప్‌ ధంఖర్‌, మాజీ దేశాధ్యక్షుడు రామ్‌నాథ్‌ కోవింద్‌ లకు ఆహ్వానం అందలేదు. గిరిజన, దళిత నేతలైన తాజా, మాజీ దేశాధ్యక్షులు ద్రౌపది ముర్ము, రామ్‌ నాథ్‌ కోవింద్‌లను ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి ఆహ్వానించలేదు.

Spread the love