పార్లమెంట్‌ కొత్త భవన ప్రారంభోత్సవం ఇలా.

.- తొలుత సర్వమత ప్రార్థనలు, తర్వాత జాతీయ గీతాలాపన
– రూ. 75 నాణేం,స్మారక తపాలా బిళ్ల విడుదల
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
నూతన పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవాన్ని ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఆదివారం ( 28న) ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం రెండు దశలుగా ఉండబోతోంది. తొలుత సర్వ మత ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ఆ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులంతా లోక్‌సభ, రాజ్యసభ ప్రాంగణాలను పర్యవేక్షిస్తారు. కార్యక్రమంలోని రెండో భాగం రాజ్యసభ ఛాంబర్‌లో జాతీయ గీతాలాపనతో మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. పార్లమెంట్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసే పందిరిలో సంప్రదాయ పూజలు, హౌమంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇందులో ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయన్‌ సింగ్‌, మాజీ ప్రధాని హెచ్‌ డి దేవగౌడ, సీనియర్‌ మంత్రులు పాల్గొంటారు. పూజా కార్యక్రమాలు పూర్తికాగానే ఇందులో పాల్గొనే ప్రముఖులంతా కలిసి లోక్‌సభ, రాజ్యసభ ప్రాంగణాలను పర్యవేక్షిస్తారు. ఉదయం ఏడింటికి హౌమం జరుగుతుంది. ఆ తరువాత సర్వ మత ప్రార్థనలు జరుగుతాయి. ఉదయం 9:30 గంటల కల్లా తొలి విడత ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తవుతుంది. అనంతరం హౌమం వేదిక వద్దే తమిళనాడు తంజావూరు శైవ మఠ పెద్దలు చోళుల రాజదండమైన సెంగాల్‌ను ప్రధాని మోడీకి అందజేస్తారు. లోక్‌సభ ఛాంబర్‌లో స్పీకర్‌ కుర్చీ వద్ద పవిత్రమైన రాజదండాన్ని (సెంగాల్‌) ప్రతిష్టిస్తారు. మధ్యాహ్నం రెండో విడత కార్యక్రమం మొదలవుతుంది. మధ్యాహ్న కార్యక్రమంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్‌ హరివంశ్‌ ప్రసంగం ఉంటుంది. రాజ్యసభ చైర్మెన్‌ జగ్దీప్‌ ధన్కర్‌ తరపున అభినందన సందేశాన్ని ఆయన చదివి వినిపిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లిఖితపూర్వక సందేశాన్ని కూడా ఇదే సందర్భంగా సభలో వినిపిస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రూ. 75 నాణేన్ని, ఒక స్మారక తపాలా బిళ్లను ప్రధాని విడుదల చేస్తారు. కార్యక్రమాన్ని ముగిస్తూ లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌ ‘ఓట్‌ ఆఫ్‌ థాంక్స్‌’ చెబుతారు.పార్లమెంటు భవనం ప్రధాన ఆర్కిటెక్ట్‌ బిమల్‌ పటేల్‌, పారిశ్రమికవేత్త రతన్‌ టాటా, పలువురు సినీ, క్రీడా ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. దాదాపు 20 రాజకీయ పార్టీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు ప్రకటించాయి. ఎన్డీయే భాగస్వామ్య పార్టీలైన అన్నాడీఎంకే, అప్నాదళ్‌, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా, శివసేన షిండే వర్గం, ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్‌, ఎన్‌డీపీపీ, ఎస్కెఎం, ఎంఎన్‌ఎఫ్‌, జేజేపీ, ఎజెఎస్‌యూ, ఆర్‌ఎల్జేపీ, ఐఎంకెఎంకె, తమిళ్‌ మనిలా కాంగ్రెస్‌, ఎల్జెపీ, ఎస్‌ఏడీ, వైసీపీ, టీడీపీ, బీజేడీ, బీఎస్పీ పార్టీలు పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవంలో పాల్గొంటాయి.

కొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవంపై పిటిషన్‌ను తిరస్కరణ
నూతన పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అడ్వకేట్‌ జయ సుకిన్‌ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్‌ జెకె మహేశ్వరి, జస్టిస్‌ పిఎస్‌ నరసింహ ధర్మాసనం విచారించింది. ఈ పిటిషన్‌ను ఎందుకు దాఖలు చేశారో తమకు తెలుసునని పేర్కొంది. దీనిని రాజ్యాంగంలోని అధికరణ 32 ప్రకారం విచారణ జరిపేందుకు నిరాకరించింది. రాజ్యాంగంలోని అధికరణ 79 ప్రకారం దేశానికి కార్యనిర్వాహక అధిపతి రాష్ట్రపతి అని పిటిషనర్‌ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించి ఉండవలసిందన్నారు. రాష్ట్రపతికి కొన్ని అధికారాలు ఉంటాయని, రకరకాల కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటారని చెప్పారు. ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవడం సరికాదని, ఆదివారం జరిగే పార్లమెంటు భవన ప్రారంభోత్సవం చట్ట ప్రకారం జరగడం లేదని పేర్కొన్నారు. పార్లమెంట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతిని దూరంగా ఉంచడం వెనుక మాల్‌ప్రాక్టీస్‌ ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించకుండా రాష్ట్రపతిని లోక్‌సభ సచివాలయం, కేంద్ర ప్రభుత్వం అవమానించాయన్నారు. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తూ, ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతిస్తే, దానిని తిరిగి హైకోర్టులో దాఖలు చేస్తారన్నారు. దీంతో ధర్మాసనం ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

Spread the love