ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి

నవతెలంగాణ -తాడ్వాయి
ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల మండలం, దామరతోగు గ్రామానికి చెందిన మొక్కటి రోహిత్ (26) గత కొన్నేళ్లుగా కుంజ బుజ్జి రాములు ఓనర్ వద్ద ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. దామరతోగు నుండి ఓనర్ అత్తగారింటికి ముద్దులగూడెం వచ్చి తిరిగి వెళుతున్న క్రమంలో కొడిశెల దాటినంక చెక్కల వొర్రె వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. దానిపై ఉన్న మరో వ్యక్తి దునకడంతో ఆయన క్షేమంగా ఉన్నాడు. డ్రైవర్ తల పై ట్రాక్టర్ బలంగా పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఏటూర్ నాగారం హాస్పిటల్ కు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Spread the love