ఉత్తరాఖండ్‌లో పేలిన ట్రాన్స్‌ఫార్మర్‌

– 15 మంది మృతి..పలువురికి గాయాలు
డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో మంగళవారం రాత్రి ఘోరం చోటు చేసుకుంది. చమోలీ జిల్లాలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పేలి 15 మంది మరణించారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. అలకనందా నది ఒడ్డున నమామి గంగా ప్రాజెక్టు సైట్‌లో ఈ విషాదం జరిగిందని అధికారులు బుధవారం తెలిపారు. మృతుల్లో ఒక పోలీసు ఎస్‌ఐ, ముగ్గురు హోంగార్డులు ఉన్నారు. వంతెనపై ఒక వ్యక్తి విద్యుదాఘాతంతో మరణించినట్టు సమాచారం రావడంతో నివేదిక తయారు చేయడం కోసం పోలీసు బృందం అక్కడకు వెళ్లిందని, అదే సమయంలో ట్రాన్స్‌ఫార్మర్‌ పేలి అక్కడ ఉన్న వంతెనకు విద్యుత్‌ ప్రవహించి మరణాలకు, గాయాలకు కారణమయిందని అధికారులు చెప్పారు. గాయపడిన వారిలో కొందరిని జిల్లా ఆస్పత్రికి, మరికొందరిని వాయుమార్గంలో రుషికేశ్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. ఈ ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జ్యుడిషియల్‌ విచారణకు ఆదేశించారు. మరోవైపు, విద్యుత్‌ శాఖ అధికారులు నిర్లక్ష్యంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Spread the love