హిందూ మతోన్మాదుల హెచ్చరికలు బేఖాతరు
డెహ్రాడూన్ : హిందూ మతోన్మాదుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ ఈ నెల 18న ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో మహాపంచాయత్ పేరిట సదస్సు నిర్వహించాలని ముస్లిం నేతలు నిర్ణయించారు. ముస్లిం వ్యాపారులు వెంటనే నగరం విడిచి వెళ్లాలంటూ హిందూత్వ గ్రూపులు బెదిరింపులకు దిగాయి. పురోలాలో ఇద్దరు వ్యక్తులు 14 సంవత్సరాల హిందూ బాలికను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో ఉత్తరకాశీ నుండి వెళ్లిపోవాలని ఈ నెల ఐదున ముస్లిం వ్యాపారుల్ని హెచ్చరించారు. కిడ్నాప్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఒక ముస్లిం, ఒక హిందువు ఉన్నారు. ఇది లవ్ జిహాద్ ఉదంతమేనని హిందూత్వ వాదులు వాదిస్తున్నారు. హెచ్చరికలతో కూడిన పోస్టర్లను పురోలా ప్రధాన మార్కెట్ ప్రాంతంలో అతికించారు. దీంతో చాలా మంది ముస్లింలు భయంతో పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ముస్లింల దుకాణాలను గుర్తించేందుకు వీలుగా వాటి వెలుపల ఇంగ్లీషు ‘ఎక్స్’ అక్షరాన్ని రాశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ముస్లింలు పెద్ద సంఖ్యలో సదస్సుకు హాజరవుతారని ముస్లిం సేవా సంఘటన్ మీడియా విభాగం ఇన్‌ఛార్జ్ వసీమ్ అహ్మద్ చెప్పారు. నిందితులను శిక్షించవలసిందేనని, అయితే ముస్లిం సమాజాన్ని అంతటినీ లక్ష్యంగా చేసుకోవడం సరికాదని డెహ్రాడూన్‌కు చెందిన మత గురువు మహమ్మద్ అహ్మద్ ఖాసిం అభిప్రాయపడ్డారు. ఇదిలావుండగా ఉత్తరకాశీలోని ముస్లింలను లక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాలలో విద్వేషపూరిత వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. ఉత్తరాఖండ్ నుండి జిహాదీలను తరిమేయాలని హిందూత్వవాది ప్రబోధానంద గిరి డిమాండ్ చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై గతంలోనే కేసు నమోదైంది. ముస్లింలు నగరాన్ని వదిలి వెళ్లకపోతే ఈ నెల 20న ప్రదర్శన నిర్వహిస్తామంటూ జిల్లా మెజిస్ట్రేట్‌కు బజరంగ్‌దళ్ లేఖ రాసింది.