స్ట్రింగర్లకు తొలగింపులు కాదు..

– వేతనాలు కావాలి : డీయూజే
– సృతి ఇరానీ, దైనిక్‌ భాస్కర్‌ తీరుపై విమర్శలు
న్యూఢిల్లీ : స్ట్రింగర్లకు తొలగింపులు కాదు.. వేతనాలు కావాలని ఢిల్లీ జర్నలిస్టుల యూనియన్‌ (డీయూజే) పేర్కొంది. న్యూస్‌ బైట్‌ కోసం ఒక జర్నలిస్టు చేసిన అభ్యర్థనపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, దైనిక్‌ భాస్కర్‌ యాజమాన్యం చేసిన ఓవర్‌యాక్షన్‌పై డీయూజే దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అయితే ఆశ్చర్యం కలిగించలేదని తెలిపింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అమేథిలోని కృష్ణనగర్‌ చౌరహాలో పర్యటనకు వచ్చి తిరిగి వెళుతున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఇతర స్థానిక మీడియా ప్రతినిధులతో కలిసి కెమెరాపర్సన్‌ విపిన్‌ యాదవ్‌ ఒక వ్యాఖ్య అడిగాడు. దీనికి కేంద్ర మంత్రి అహంకారంగా, చిరాకుగా సమాధానంపై ఇచ్చారు. పైగా దైనిక్‌ భాస్కర్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తానని బెదరించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో యాదవ్‌ను, స్ట్రింగర్‌ రషీద్‌ హుస్సైన్‌ను తక్షణమే, నిర్మొహమా టంగా దైనిక్‌ భాస్కర్‌ యాజమాన్యం తొలగించింది. ఆ ప్రాంతంలో తమకు జర్నలిస్టు లేరని కూడా దైనిక్‌ భాస్కర్‌ ట్వీట్‌ చేసింది. అయితే ఇలా జర్నలిస్టును బహిరంగంగా అవమానించిన యాజమాన్యం మైక్‌ ఐడీని తిరిగి ఇవ్వమని ప్రయివేట్‌గా డిమాండ్‌ చేసింది. అధికారిక ఒప్పందం లేనప్పుడు ఇలాంటి మైక్‌ ఐడిలే ఉపాధికి ప్రధాన రుజువు. స్ట్రింగర్లుకు తక్కువ వేతనం ఉంటుంది. ఇలాంటి ఉద్యోగులను అధికారబద్ధం చేయాలని, తగిన వేతనా లు ఇవ్వాలని డీయూజే డిమాండ్‌ చేసింది. జర్నలిస్టులను అవమానించే బదులు వారికి తగిన గౌరవం ఇవ్వాలని డీయూజే సూచించింది.

Spread the love