– ట్విట్టర్‌లో టార్గెట్ చేస్తున్న హిందూత్వ, బీజేపీ అనుకూల గ్రూపులు
– బీజేపీ అనుకూల వెబ్‌సైట్లలో కల్పిత, ఊహాజనిత కథనాలు
– అమెరికా పర్యటనలో మోడీని మైనారిటీలపై వివక్ష గురించి ప్రశ్నించిన సబ్రినా సిద్దిఖీ
న్యూఢిల్లీ : భారత్‌లో మైనారిటీలపై వివక్ష గురించి అమెరికా పర్యటనలో మోడీని ప్రశ్నించిన వాల్‌స్ట్రీట్ జర్నల్ (డబ్ల్యూఎస్‌జే) మహిళా జర్నలిస్టు సబ్రినా సిద్దిఖీకి సోషల్ మీడియాలో వేధింపులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా, ట్విట్టర్ వేదికగా ఆమెను హిందూత్వ శక్తులు, బీజేపీ అనుకూల గ్రూపులు టార్గెట్ చేస్తున్నాయి. ఆమెను, ఆమె వ్యక్తిగత నేపథ్యాన్ని లక్ష్యంగా చేసుకొంటూ కొందరు యూజర్లు పోస్టులు పెడుతున్నారు. ఆమె ముస్లిం వ్యక్తనీ, తల్లిదండ్రులు పాకిస్థాన్‌కు చెందినవారనీ, ఆ దేశంతో వారికి సంబంధాలున్నాయంటూ ఆన్‌లైన్‌లో హిందూత్వ శక్తులు హైలెట్ చేస్తున్నాయి. బీజేపీ సమాచార విభాగం అధిపతి అమిత్ మాల్వియా నేతృత్వంలో ఇది జరిగటం గమనార్హం.
సబ్రినా సిద్దిఖీ డబ్ల్యూఎస్‌జేకు వైట్ హౌజ్ కరెస్పాండెంట్‌గా ఉన్నారు. ఇటీవల అమెరికాలో పర్యటించిన మోడీని భారత్‌లో మైనారిటీల వివక్ష గురించి సబ్రినా సిద్ధిఖీ ప్రశ్నించారు. విదేశీ పర్యటనలో మోడీకి ఇలాంటి ఒక ప్రశ్న ఎదురవటం ఇదే మొదటిసారి. దీనిని జీర్ణం చేసుకోలేక వెంటనే సోషల్ మీడియాలో బీజేపీ, హిందూత్వ అనుకూల గ్రూపులు రంగంలోకి దిగాయి. ట్విట్టర్ ఖాతాలలో ఆమెకు వ్యతిరేకంగా పోస్టులు చేశాయి. ఆమెను ‘పాకిస్థానీ ఇస్లామిస్టు’గా అభివర్ణించాయి. మోడీని అలాంటి ప్రశ్న అడగటంలో కుట్ర కోణం ఉన్నదని ఆరోపించాయి. ”ఆమె భారత్‌ను మాత్రమే దాడి చేస్తుంది. ద్వేషించటం పాకిస్థానీల డీఎన్‌ఏ” అని మరొక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్టు కనబడింది. ఇక బీజేపీ అనుకూల వెబ్‌సైట్లు కొన్ని మరొక అడుగు ముందుకేసి ఆమెపై ఆరోపణలను తీవ్రం చేశాయి. కల్పిత, ఊహాజనిత వార్తాకథనాలను ప్రచురించాయి. ఆమె పాకిస్థానీ తల్లిదండ్రుల కూతురు అని పేర్కొన్నాయి. ఇస్లామిస్టుల వాదనలను ఆమె ప్రతిధ్వనిస్తున్నదని ఆరోపించాయి.
ఆరోపణలను తిప్పికొట్టిన సబ్రినా
తనను టార్గెట్ చేసుకుంటూ ఆన్‌లైన్‌లో వస్తున్న ఆరోపణలు, విమర్శలకు సబ్రినా సిద్ధిఖీ ట్విట్టర్‌లో స్పందించారు. భారత్‌లో జన్మించిన తన తండ్రితో కలిసి భారత క్రికెట్ జట్టును ఉత్సాహపరుస్తున్న ఒక ఫోటోను తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఆమె పోస్టు చేశారు. కొందరు తన వ్యక్తిగత నేపథ్యం గురించి మాట్లాడుతున్నారనీ, దీనిపై పూర్తి చిత్రాన్ని అందించటం సరైనదనిపిస్తున్నదని ఆమె రాసుకొచ్చారు. కొన్ని సార్లు గుర్తింపులు అనేవి కనబడేవాటి కంటే క్లిష్టమైనవని పేర్కొన్నారు.