
– వివరాలను వెల్లడించిన ఎస్పీ
– నేరస్తులుఅంతా ఒకే కుటుంబానికి చెందినవారు
నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
గత కొన్ని రోజులుగా నల్గొండ జిల్లాలోని వాడపల్లి, అడవిదేవులపల్లి, మిర్యాలగూడ, వేములపల్లి, త్రిపురారం, నిడమానూర్, తిప్పర్తి, నల్గొండ, నకిరేకల్, చిట్యాల పోలీస్ స్టేషన్ ల పరిదిలోని వ్యవసాయ పొలాల వద్ద రైతులు వ్యవసాయ మోటార్ లకు కరెంట్ సప్లయ్ నిమ్మిత్తo ఏర్పాటు చేసుకున్నా ట్రాన్స్ఫార్మర్ లను లక్ష్యం గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవర్ తెలిపారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నేరస్తుల వివరాలకు వెల్లడించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని వ్యవసాయ పొలాల వద్ద రైతులు ఏర్పాటు చేసుకున్న ట్రాన్స్ఫార్మర్ లక్ష్యంగా చేసుకొని వాటిని డ్యామేజ్ చేసి అందులో గల కాపర్ వైర్ లను, ఆయిల్ దొంగతనం జరుగుతుందని తెలుసుకున్న ఎస్సై తమ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో నర్సాపూరం రోడ్డు లో ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో వారిని పట్టుకుని విచారించగా నేరాలను ఒప్పుకున్నారని తెలిపారు.
నేరస్తులు మెగావత్ రంగానాయక్, జటవత్ ఇమామ్నాయక్, మౌలానా, షేక్ జటవత్ వలి, కేతవత్ సునీల్, గా గుర్తించారు. నేరస్తులు అంత ఒకే కుటుంబానికి చెందినవారని పేర్కొన్నారు. నేరస్తుల నుండి 9 లక్షల రూపాయల నగదు, షిఫ్ట్ డిజైర్ కారు, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నేరస్తులు దొంగిలించిన వాటిని హైదరాబాదులోని పాత ఇనుప సామాను వ్యాపారస్తులకు అమ్ముతూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని, నేరస్తులపై 32 కేసులు నమోదు అయినట్లు తెలిపారు. నేరస్తులను పట్టుకోవడం లో చాక చక్యంగా వ్యవహరించిన మిర్యాలగూడ రూరల్ సీఐ వీరబాబు, టాస్క్ ఫోర్స్ సీఐ రమేష్ బాబు, వాడపల్లి ఎస్ ఐ రవి, టాస్క్ ఫోర్స్ ఎస్ ఐ మహేందర్, సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అభినందించారు.