నవతెలంగాణ – చండూరు
ఇటీవల టీజీపీఎస్సీ ప్రకటించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఫలితాలల్లో కనగల్ మండలం జి.ఎడవల్లి గ్రామానికి చెందిన చిలుకూరి ఐశ్వర్య సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈమె చండూరు గాంధీజీ విద్యాసంస్థలలో పదవ తరగతి వరకు చదివినది. ఏఈఈ ఉద్యోగం సాధించినందుకు గాను పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు శాలువాను కప్పి జ్ఞాపకను అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ పదవ తరగతి వరకు గాంధీజీ పాఠశాలలో చదువుకొని, ఇంటర్ నల్లగొండ ప్రగతి జూనియర్ కళాశాలలోనూ, విఎన్ఐటి నాగపూర్ లో బీటెక్ పూర్తి చేసిందని, ఆగస్టు రెండవ తేదీన ప్రకటించిన ఏఈఈ ఉద్యోగ పోటీ పరీక్ష ఫలితాలలో సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగానికి ఎంపికైనదని తెలిపారు. చిలుకూరి ఐశ్వర్య తండ్రి చేనేత కార్మికుడని, తాను కష్టపడి కూతుర్ని చదివించారని, ఆమె చదువుకు పేదరికం అడ్డు రాలేదని, ఐశ్వర్యను ఆదర్శంగా తీసుకొని పిల్లలందరూ కష్టపడి చదవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ సత్యనారాయణమూర్తి, తండ్రి చిలుకూరు వెంకటేశం, పులిపాటి రాధిక, ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.