Thursday, May 14, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంచైనాలో ట్రంప్

చైనాలో ట్రంప్

- Advertisement -

తొమ్మిదేండ్ల తర్వాత బీజింగ్ పర్యటన
విమానాశ్రయంలో స్వాగతం పలికిన అధికారులు
చైనా పతాకాల రెపరెపల మధ్య ఎర్రతివాచీపై యూఎస్ అధ్యక్షుడి అడుగులు
వాణిజ్య, ఆర్థిక అంశాలపై జిన్‌పింగ్‌తో చర్చించనున్న డోనాల్డ్

వాషింగ్టన్/బీజింగ్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మూడు రోజుల పర్యటనలో భాగంగా బీజింగ్‌కు చేరుకున్నారు. తొమ్మిదేండ్ల తర్వాత బీజింగ్ పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడికి విమానాశ్రయంలో అధికారులు స్వాగతం పలికారు. చైనా పతాకాల రెపరెపల మధ్య ఎర్రతివాచీపై యూఎస్ అధ్యక్షుడి అడుగులు ముందుకు సాగాయి.

ట్రంప్‌తో పాటు మస్క్‌, టిమ్‌కుక్‌..
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు తాను కూడా బీజింగ్‌కు వెళ్లినట్టు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ పేర్కొన్నారు. అమెరికా అధికారులతో పాటు యాపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌, ఎన్‌విడియాకు చెందిన జెన్సన్ హువాంగ్ వంటి దేశ అగ్రశ్రేణి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు చైనాకు వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో చైనాతో అమెరికా టెక్‌కు సంబంధించి పెద్ద ఒప్పందం చేసుకునే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

హార్ముజ్‌ను తెరిచేలా ఇరాన్‌ను ఒప్పించండి
హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేలా ఇరాన్‌ను ఒప్పించాల్సిందిగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ సహా పలువురు మంత్రులు, అధికారులు చైనాపై ఒత్తిడి తెస్తున్నారు. ఇరాన్ యుద్ధాన్ని చైనా బాహాటంగానే వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. సంయమనం పాటించాలని, చర్చల ద్వారా సమ స్యలను పరిష్కరించుకోవాలని ఇరు పక్షాలకు సూచిస్తోంది.

నేడు జిన్‌పింగ్‌తో భేటీ
బుధవారం సాయంత్రం బీజింగ్ చేరుకున్న ట్రంప్ లాంఛనప్రాయమైన స్వాగత కార్యక్రమం అనంతరం తాను బస చేసే హోటల్‌కు చేరుకున్నారు. గురువారం అధికారిక విందుకు హాజరైన తర్వాత శుక్రవారం జిన్‌పింగ్‌తో చర్చలు జరుపుతారు. అనంతరం అమెరికతిరిగి పయనమవుతారు. దక్షిణ కొరియాలోని బుసాన్‌లో గత సంవత్సరం అక్టోబరులో ఆసియా‘పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు జరిగినప్పుడు ట్రంప్, జిన్‌పింగ్ సమావేశమయ్యారు. ఆ తర్వాత ఇరువురు నేతలు భేటీ కావడం ఇదే మొదటిసారి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చైనాలో పర్యటించడం ఇది రెండోసారి. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి బీజింగ్ వచ్చారు. జిన్‌పింగ్ ఈ సంవత్సరం చివరలో అమెరికాలో పర్యటించే అవకాశం ఉంది.

చర్చించే అంశాలు ఇవే
అమెరికా ఆహార పదార్థాలు, విమానాలను ఎక్కువగా కొనుగోలు చేసేలా చైనాతో ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. జిన్‌పింగ్‌తో ఇతర విషయాల కంటే వాణిజ్యం పైనే ఎక్కువగా చర్చిస్తానని ట్రంప్ ఇప్పటికే చెప్పారు. అందుకే ట్రంప్‌తో పాటు టెస్లా సీఈఓ ఎలన్ మస్క్, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ సహా పలువురు అమెరికా వ్యాపారవేత్తలు కూడా చైనా పర్యటకు వచ్చారు. ట్రంప్, జిన్‌పింగ్ మధ్య జరిగే చర్చలలో వాణిజ్యంతో పాటు ఆర్థిక అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. అమెరికా నుంచి బోయింగ్ విమానాలు, వ్యవసాయోత్పత్తుల కొనుగోలు, ఇంధన సరఫరాలపై చైనా ఒప్పందం కుదుర్చుకుంటుందని భావిస్తున్నారు. ఐదు వందల బోయింగ్ 737 జెట్ విమానాలు, అనేక జీఈ-పవర్డ్ వైడ్‌బాడీ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంపై బోయింగ్, చైనా అధికారులు చర్చలు జరుపుతున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 2017 తర్వాత పెద్ద ఎత్తున బోయింగ్ విమానాల కొనుగోలుకు చైనా ఆర్డర్ ఇవ్వడం ఇదే మొదటిసారి. వైమానిక చరిత్రలోనే ఇది అతి పెద్ద విమాన ఒప్పందం కాబోతోంది. కాగా ప్రస్తుతం రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఒప్పందాన్ని పొడిగించే విషయంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అమలులో ఉన్న ఒప్పందం ప్రకారం చైనా నుంచి అమెరికాకు రేర్ ఎర్త్ ఖనిజాలు ఎగుమతి అవుతున్నాయి. సుంకాల పోరు తిరిగి ప్రారంభం కాకుండా నివారించాలని కూడా ఇరు పక్షాలు కోరుకుంటున్నాయి.

బీజింగ్ పర్యటనలో లేని ఫస్ట్ లేడీ
ట్రంప్ మూడు రోజుల చైనా పర్యటనలో ఆయన సతీమణి మెలెనియా ట్రంప్ భాగస్వామి కావడం లేదు. 2017లో ట్రంప్ దంపతులు బీజింగ్‌లో పర్యటించినప్పుడు మెలెనియా చైనా నాయకత్వం ఏర్పాటు చేసిన అనేక దౌత్య, సాంస్కృతిక కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. జిన్‌పింగ్ సతీమణి పెంగ్ లియువన్‌తో కలిసి అనేక కార్యక్రమాలకు హాజరయ్యారు. బెన్‌ఛాంగ్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పెకింగ్ ఒపేరా ప్రదర్శనను తిలకించారు. చైనా సంస్కృతిని ప్రతిబింబించే పలు ప్రదర్శనలకు హాజరయ్యారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను, బీజింగ్‌లో పాండా ఎగ్జిబిట్‌ను సందర్శించారు.

మాటమార్చిన ట్రంప్
ఇరాన్‌పై సాగిస్తున్న యుద్ధానికి ముగింపు పలికే విషయంలో తమకు చైనా సాయం అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో బుధవారం బీజింగ్ బయలుదేరడానికి ముందు వాషింగ్టన్ డీసీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ యుద్ధంలో శాంతియుతంగానో లేదా మరో విధంగానో తాము విజయం సాధిస్తామని, ఎవరి సాయం అవసరం లేదని అన్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సుదీర్ఘ చర్చలు జరపాల్సి ఉన్నదని, ఆయన చాలా మంచివాడని చెప్పారు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే మాట మార్చారు. ‘చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంది. వాటిలో ఇరాన్ ఉంటుందని నేను చెప్పను. ఎందుకంటే ఇరాన్ పూర్తిగా మా అధీనంలో ఉంది’ అని తెలిపారు. యుద్ధాన్ని ముగించేందుకు జరుపుతున్న సంప్రదింపులకు సంబంధించి తాను తీసుకోబోయే విధాన నిర్ణయాలలో అమెరికా ప్రజల ఆర్థిక ఇబ్బందులు ఒక అంశం కాదని అన్నారు.

‘నేను అమెరికన్ల ఆర్థిక పరిస్థితులను గురించి ఆలోచించను. నేను ఎవరి గురించీ ఆలోచించను’ అని చెప్పారు. తాను ఒకే విషయం గురించి ఆలోచిస్తానని అంటూ ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండనీయకూడదని, అదే తనను ప్రేరేపించే విషయమని చెప్పుకొచ్చారు. ఇరాన్ యుద్ధం కారణంగా అమెరికాలో ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్రవ్యోల్బణం అదుపు తప్పుతోంది. దేశీయంగా ట్రంప్‌పై ఒత్తిడి పెరుగుతోంది. అయితే యుద్ధం ఎక్కువ కాలం కొనసాగబోదని, అది ముగిసిన తర్వాత చమురు ధరలు, ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తాయని ట్రంప్ తెలిపారు. వందలాది చమురు ట్యాంకర్లు మధ్యప్రాచ్యాన్ని వదిలి బయటికి రావడం కోసం ఎదురు చూస్తున్నాయని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -