నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గతేడాది వేసవి సెలవుల్లో విధులు నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులను మంజూరు చేయాలనీ, అందుకు తగు ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం (టీఎస్‌జీహెచ్‌ఎంఏ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి ఆర్ రాజగంగారెడ్డి, కోశాధికారి బి తుకారాం గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు అసంపూర్ణమని తెలిపారు. వేసవి సెలవుల్లో పనిచేసిన కాలాన్ని పూర్తిగా పరిగణనలోకి తీసుకుని నిబంధనల ప్రకారం ప్రధానోపాధ్యా యులు, ఉపాధ్యాయులకు ఈఎల్స్ ప్రిజర్వ్ చేయాలని సూచించారు. విద్యాశాఖ ఆదేశాల ప్రకారం వారు గతేడాది ఏప్రిల్ 25 నుంచి మే 21 వరకు పదో తరగతి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సంసిద్ధం చేసేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహించారని గుర్తు చేశారు. కానీ విద్యాశాఖ అధికారులు ఆ కాలానికి సంపాదిత సెలవులు మంజూరు చేయొద్దంటూ ఉత్తర్వులిచ్చారని తెలిపారు. నిబంధనల ప్రకారం పని చేసిన కాలానికి సంపాదిత సెలవులు తప్పనిసరిగా మంజూరు చేయాలని పేర్కొన్నారు.