– దాని ప్రకారమైతే రేవంత్‌రెడ్డి పదవులకు అనర్హుడు : దాసోజు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎమ్యెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ఎనిమిది పేజీల దరఖాస్తుతో పాటు ఆరు, ఏడో పేజీల్లో 17 అంశాలతో కూడుకొని ఉన్న ప్రవర్తనా నియమావళి డిక్లరేషన్‌పై ఆ పార్టీ నేతలు తిరగపడాలని బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రవర్తనా నియమావళిలోని 1, 6, 7, 9, 11, 13, 15, 16 అంశాలను కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటే అసలు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అనర్హుడని పేర్కొన్నారు. ఆయన్ను వెంటనే టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నిబంధనలు పెట్టింది కేవలం సామాన్య అభ్యర్థుల కోసం మాత్రమేననీ, అహంకారంతో రారాజు వలె వ్యవహరించే రేవంత్‌రెడ్డికి కాదనే అనుమానాలు వస్తాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఆధిపత్య, అహంకార మోసాన్ని గుర్తించి నేతలంతా తిరగబడాలని పిలుపునిచ్చారు.