సుప్రీంకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జీలు

– ప్రశాంత్‌కుమార్‌, విశ్వనాథన్‌ ప్రమాణస్వీకారం
న్యూఢిల్లీ: భారత సర్వోన్నత న్యాయస్థానంలో ఇద్దరు న్యాయమూర్తులు కొత్తగా కొలువుదీరారు. జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, సీనియర్‌ న్యాయవాది కేవీ విశ్వనాథన్‌లతో శుక్రవారం ప్రధాన న్యాయమార్తి జస్టిస్‌ డివై చంద్ర చూడ్‌ సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ఇద్దరు జడ్జీల నియామకంతో సుప్రీం కోర్టులో మొత్తం జడ్జీల సంఖ్య గరిష్ఠ పరిమితి 34కు (సీజేఐతో కలిపి) చేరింది. అయితే, సుప్రీం కోర్టులో ఈ పూర్తిస్థాయి జడ్జీల సంఖ్య కొద్ది కాలం మాత్రమే కొనసాగనుంది.
జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ అజరు రస్తోగి, జస్టిస్‌ వీ రామసుబ్రమణియన్‌లు వచ్చే నెలలోనే పదవీ విరమణ చేయనున్నారు. సుప్రీం కోర్టు జడ్జీలుగా జస్టిస్‌ మిశ్రా, సీని యర్‌ న్యాయవాది విశ్వనాథన్‌ పేర్లను సిజెఐ నేతృత్వంలోని కొలీజియం ఈ నెల 16న కేంద్రానికి సిఫారసు చేసింది. రెండు రోజుల్లోనే ఈ నియామ కాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించింది. వీరిద్దరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం ఆమోదముద్ర వేశారు.
ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి..
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. హైకోర్టు న్యాయమూర్తిగా 13 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హైకోర్టుల న్యాయమూర్తుల ఆల్‌ ఇండియా సీనియారిటీ జాబితాలో 21వ స్థానంలో ఉన్నారు.
బార్‌ కౌన్సిల్‌ నుంచి నేరుగా సుప్రీంకు..
తమిళనాడుకు చెందిన సీనియర్‌ న్యాయవాది విశ్వనాథన్‌ బార్‌ కౌన్సిల్‌ నుంచి నేరుగా సుప్రీం కోర్టు జడ్జిగా ఎంపికయ్యారు. సీనియార్టీ ప్రకారం 2030 ఆగస్టు 11న జస్టిస్‌ జేబీ పార్దీవాలా పదవీ విరమణ అనంతరం జస్టిస్‌ విశ్వనాథన్‌ సీజేఐగా నియమితులు కానున్నారు. 2031 మే 25వరకు ఆ పదవిలో ఉంటారు. న్యాయవాదిగా అనేక కీలక కేసులు వాదించిన జస్టిస్‌ విశ్వనాథన్‌ ఇటీవల స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కేసులోనూ పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించారు.

Spread the love