నిరుద్యోగం, ద్రవ్యోల్బణమే కారణం..

నిరుద్యోగం, ద్రవ్యోల్బణమే కారణం..– పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై రాహుల్‌
న్యూఢిల్లీ : పార్లమెంటులో చోటుచేసుకున్న పరిణామాలు, భద్రతా వైఫల్యంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ బీజేపీ ప్రభుతాన్ని తప్పుపట్టారు. ఈ వైఫల్యానికి నిరుద్యోగం, ద్రవ్యోల్బణమే కారణమని మండిపడ్డారు. ‘లోక్‌సభలో భద్రతా లోపం కన్పించింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగాయి. సభలో చోటుచేసుకున్న పరిణామాలకు ఇవే కారణం’ అని ఆయన చెప్పారు. రాహుల్‌ శనివారం విలేకరులతో మాట్లాడుతూ ‘ఉద్యోగాలు ఎక్కడున్నాయి? దేశంలో యువత తీవ్ర నిరాశానిస్పృహలకు లోనయ్యారు. మనం ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించాలి. యువతకు ఉద్యోగాలు కల్పించాలి. పార్లమెంటులో జరిగింది కచ్చితంగా భద్రతా వైఫల్యమే. జరిగిన ఘటన అవాంఛనీయమే. కానీ, దీని వెనుక ఉన్న కారణం దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య…నిరుద్యోగం’ అని తెలిపారు.
అయితే రాహుల్‌ విమర్శలను బీజేపీ తోసిపుచ్చింది. దేశంలో నిరుద్యోగం కేవలం 3.2% మాత్రమేనని, ఆరు సంవత్సరాలలో ఇది అత్యంత కనిష్టమని తెలిపింది. పార్లమెంటులో చొరబడిన నిందితులతో కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఐ (ఎం)కు ఉన్న సంబంధంపై రాహుల్‌, ఇండియా కూటమి వివరణ ఇవ్వాలని బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్‌ మాల్వియా డిమాండ్‌ చేశారు. చొరబాటుదారులకు న్యాయ సహాయం అందించేందుకు ముందుకు వచ్చిన అసిమ్‌ సరోడ్‌ భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి నడిచారని చెప్పారు. సరోడ్‌తో ఉన్న సంబంధమేమిటో రాహుల్‌ చెప్పాలని సూచించారు.

Spread the love