Sunday, May 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ హయాంలో అన్నదాతలకు తప్పని తిప్పలు 

కాంగ్రెస్ హయాంలో అన్నదాతలకు తప్పని తిప్పలు 

- Advertisement -

– నేడు మోర్తాడ్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన 
– ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపు
– రైస్ మిల్లర్ల చేతుల్లో కీలుబొమ్మగా మారిన ప్రభుత్వం
– నెల రోజులుగా కళ్ళాల దగ్గరే రైతులు.
– జిల్లా కలెక్టర్ ఫోన్ ఎత్తడం లేదు
శాసనసభ్యుడికే ఈ పరిస్థితి ఉంటే సామాన్యుల మాటేంటి?
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
నిజామాబాద్ జిల్లాలో, ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో వడ్ల కొనుగోళ్లు అత్యంత నత్తనడకన సాగుతున్నాయని, రైతులు పంటను అమ్ముకోవడానికి గత నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నారని దీనికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం వేల్పూర్ మండల కేంద్రంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత మూడు రోజులుగా నియోజకవర్గంలోని పలు కొనుగోలు కేంద్రాలను స్వయంగా సందర్శించిన ఆయన ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి రేపు మోర్తాడ్ లో రైతు నిరసన కార్యక్రమం చేపడుతున్నామని, రైతులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరై నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ   పిలుపునిచ్చారు. ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేస్తామని ప్రకటించి, సెంటర్లు తెరిచేసరికి 15 రోజులు, గన్నీ బ్యాగులు వచ్చేసరికి వారం, కాంటా పెట్టేసరికి మరో వారం అన్నట్లుగా 20 రోజుల పాటు కావాలనే జాప్యం చేసిందని విమర్శించారు.

మద్దతు ధర రూ. 2390 ఉండగా, ప్రభుత్వ జాప్యం భరించలేక రైతులు గత్యంతరం లేక ప్రైవేటు వ్యక్తులకు రూ. 1750 నుండి 1900 లకే అమ్ముకుంటున్నారని, దీనివల్ల ఎకరాకు సుమారు రూ. 15,000 నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రైస్ మిల్లర్లు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని, తరుగు పేరుతో 40 కిలోలకు 5 కిలోల అదనపు వడ్లు (క్వింటాల్‌కు 12.5 కిలోలు) దోచుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఇది కేవలం 1.5 కిలోలు మాత్రమే ఉండేదని గుర్తు చేశారు.రైతుల సమస్యలపై మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేస్తే, ఫోన్ ఎత్తడం లేదని, కనీసం స్పందించే తీరిక కూడా లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ పాలిసీ లో భాగమేన అని ఆయన దుయ్యబట్టారు.వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని, వడ్ల రవాణాకు లారీలను పెంచాలని, గన్నీ బ్యాగుల కొరత తీర్చాలన్నారు.తరుగును తగ్గించి, పాత పద్ధతిలోనే వడ్లు సేకరించాలని ప్రశాంతి రెడ్డి డిమాండ్ చేశారు.

 రైతుల పక్షాన పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి రైతులకు న్యాయం చేసే వరకు విశ్రమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రేపు (సోమవారం) ఉదయం 10 గంటలకు మోర్తాడ్‌లో ప్రభుత్వ వైఖరికి నిరసనగ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలోని రైతులందరూ, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ నిరసనను విజయవంతం చేయాలని వేముల ప్రశాంత్ రెడ్డి  పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -