– నిపుణుల సూచనలు బేఖాతరు కాళేశ్వరంలో ప్రజాధనం వృధా
– నిస్పక్షపాత ఇంజినీర్లతో కమిటీ వేయాలి
– అఖిలపక్షంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి
– నష్టానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
– కేంద్రం ప్రేక్షక పాత్ర తగదు : టీజేఎస్ బహిరంగ చర్చలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గత బీఆర్‌ఎస్ సర్కారు నిపుణుల కమిటీ సూచనలను పక్కన పెట్టి ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంతో ప్రజాధనం వృధా అయిందని సీపీఐ (ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని సోమాజీగూ డ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు – బీఆర్‌ఎస్ అబద్ధాలు- కాగ్ చెప్పిన వాస్తవాలు అనే అంశంపై నిర్వహించిన బహిరంగ చర్చలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం నిర్మాణంలో వాస్తవాలు ప్రజలకు తెలిసేలా నిస్పక్ష పాతంగా ఉండే ఇంజినీర్లతో కమిటీ వేయించి నిర్దిష్ట సమయంలోగా నివేదిక ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించడం తగదని హితవు పలికారు.
కాళేశ్వరంపై అధికార, ప్రతిపక్షాలు చెబుతున్న దానిలో సామాన్యులు వాస్తవాన్ని గ్రహించేలా వారికి అర్థమయ్యేలా వివరించే కార్యక్రమాలు చేపట్టాలని మేధావులు, విద్యావంతులు, స్వచ్ఛంద సంస్థలు, ఇంజినీర్లకు ఆయన సూచించారు. దివంగత ముఖ్యమంత్రి ప్రాణహిత ప్రాజెక్టు ప్రతిపాదించిన సమయంలో తాను శాసనసభలో జరిగిన చర్చలో పాల్గొన్నానని గుర్తుచేశారు. నీళ్లు, నియామకాలు, నిధుల కోసం ప్రత్యేక రాష్ట్రమంటూ సాగిన ఉద్యమంలో పాల్గొన్న నేతలు, మేధావులతోనూ మాజీ సీఎం కేసీఆర్ చర్చించలేదని విమర్శించారు. డిజైన్ మార్పు చేసి చేపట్టే నిర్మాణంతో నిర్వహణ, విద్యుత్ ఖర్చులు ఎక్కువవుతాయని నిపుణులు చెప్పిన సూచనలనూ పెడచెవిన పెట్టారని తెలిపారు. నిపుణుల కమిటీ వేయడం, నిర్దిష్ట సమయంలోపు నివేదిక తెప్పించుకోవడం, అఖిలపక్షం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకోవడం, సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ నివేదికను నెలరోజుల్లో ఇచ్చేలా ఒత్తిడి చేయడం వంటి చర్యలను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జరిగిన నష్టానికి బాధ్యులెవరో గుర్తించాలని కోరారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. కోదండరాం నేతృత్వంలో మేడిగడ్డను సందర్శించి సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమవుదామని సమావేశంలోని భాగస్వాములకు ఆయన సూచించారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ మేడిగడ్డలో 3 పిల్లర్లు కాదు… 3 వ్యవస్థలు కుప్పకూలిపోయాయని ధ్వజమెత్తారు. ఐక్యరాజ్య సమితి కోసం పని చేసిన అనుభవజ్ఞుడు హనుమంతరావు సైతం ప్రాజెక్ట్ కట్టవద్దని చెప్పినా వినలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం డిజైన్లు కూడా కాంట్రాక్టర్లకే అప్పగించారు. ప్రాజెక్టు మెయింటెనెన్స్‌ను కాగ్ తప్పుబ ట్టిందని గుర్తుచేశారు. భూకంపాలు వచ్చే చోట మల్లన్న సాగర్ కట్టారని తెలిపారు. రూ.లక్షకు 87వేల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా కుప్పకూ ల్చారు. అంతర్జాతీయ నిపుణుల సర్వే చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కాళేశ్వరంపై ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ముందుకు సాగితేనే ప్రజలకు, రైతులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. బీఆర్‌ఎస్ నాయకులు కాగ్ నివేదికలను నమ్మమంటూ మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రాజెక్టు నిర్వహణ ఖర్చు, అప్పులకు వడ్డీ ప్రతి ఏటా పెరుగుతుందని చెప్పారు. ప్రాణహిత పూర్తి చేస్తే ఇంత ఖర్చయ్యేది కాదు. కేసీఆర్ స్వయం ప్రకటిత ఇంజినీర్ అని ఎద్దేవా చేశారు. కుక్క పని కుక్క చేయాలి. గాడిద పని గాడిద చేయాలి. ఒకరి పని మరొకరు చేస్తే ఇలాగే ఉంటుందని విమర్శించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ రీడిజైన్ పేరుతో నిధులు దుబారా చేసిన మాజీ సీఎం కేసీఆర్‌ను అరెస్ట్ డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం పని చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవసరం ఉందా? లేదా అనేది ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని మురళి సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ కన్నెగంటి రవి, సీపీఐ నాయకురాలు పశ్య పద్మ, టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ధర్మార్జున్, బైరి రమేష్, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు, సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నాయకులు కె.గోవర్థన్ పాల్గొన్నారు.