దక్షిణ చైనా సముద్రంలో అమెరికా కవ్వింపులు!

American provocations in the South China Sea!ప్రపంచ రాజకీయాల్లో ఎదురుదెబ్బలు తింటున్న అమెరికా నిరంతరం ఎక్కడో ఒకచోట చిచ్చుపెడుతూనే ఉంది. దానిలో తైవాన్‌ ఒకటి. ఆ ప్రాంతం చైనాలో అంతర్భాగమని ఐరాస గుర్తించినప్పటికీ విలీనానికి అమెరికా, ఇతర దాని ఐరోపా మిత్రదేశాలు మోకాలడ్డుతున్నాయి. ఆ పేరుతో చైనాతో కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. చైనా పాటిస్తున్న సంయమనం కారణంగా ఇతర కారణాలు చూపి దక్షిణ చైనా సముద్రంలో అల్లకల్లోలానికి చూస్తున్నాయి. దానిలో భాగమే తాజాగా ఫిలిప్పీన్స్‌ను రంగంలోకి దించాయి. నాన్షా దీవుల్లో భాగమైన రెనారు జియావో దీవి తనదని ఫిలిప్పీన్స్‌ చెబుతోంది. నాన్షాదీవులన్నీ తనవే అని చైనా అంటోంది. వాటి మధ్య వివాదం ఉంది. పరస్పరం చర్చించుకొని పరిష్కరించు కోవాలని రెండు దేశాలూ గతంలో అంగీకరించాయి. దానికి భిన్నంగా మంగళవారం నాడు ఫిలిప్పీన్స్‌ రెండు తీర రక్షక నౌకలు, రెండు రవాణా నౌకలను రెనారు దీవిలోకి పంపటమే గాక అక్కడ ఉన్న ఒక చైనా నౌకను ఢ కొట్టించింది. చైనా నౌకాదళం వాటిని తిప్పికొట్టింది. ఇది దాడి అని వర్ణిస్తూ తన మిత్రదేశమైన ఫిలిప్పీన్స్‌తో తమకు ఉన్న రక్షణ ఒప్పందం మేరకు తాము రంగంలోకి దిగాల్సి ఉంటుందని అమెరికా బెదిరింపులకు దిగింది.
అమెరికా తన ప్రయోజనాలకు అనేక దేశాలను పావులుగా, శిఖండులుగా వినియోగించుకోవటం తెలిసిందే. రెనారు జియావో దీవి దాని పరిసర జలాలు పూర్తిగా తమవేనని చైనా ఈ సందర్భంగా స్పష్టం చేసింది.అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే వారి మీద చర్యలు తీసుకొనే అధికారం తమకుందని కూడా పేర్కొన్నది. ఇవన్నీ తెలిసి కూడా అమె రికా వ్యవహరిస్తున్నదని, అది ఆడించినట్లుగా ఆడితే చివరకు నష్టపోయేది పావులుగా మారిన దేశాలేనని కూడా ఫిలిప్పీన్స్‌ను హెచ్చ రించింది. స్వంత చట్టాలను ఉటంకిస్తూ ఐరాస ఒప్పందాలను, సముద్ర చట్టాన్ని ఉల్లంఘిస్తూ కొన్ని దేశాలు చెబుతున్న భాష్యాలు చెల్లవని చైనా స్పష్టం చేసింది. చైనా ఆధీనంలోని వివాదాస్పద దీవుల్లోకి ఇటీవల తరచూ ఫిలిప్పీన్స్‌ నౌకలు అక్రమంగా చొరబడుతూ రెచ్చగొడుతున్నాయి. సముద్ర ప్రాంత చట్టం పేరుతో ఫిలిప్పీన్స్‌ పార్లమెంటు ఇటీవల ఆమోదించిన దానిలో వివాదాస్పద దీవులు, వాటి పరిసర జలాలు తమవిగా పేర్కొన్నది. ఆ పేరుతో మంగళవారం నాడు తన నౌకలను నడిపింది.
దక్షిణ చైనా సముద్రంలో తరచూ రెచ్చగొట్టే చర్యలకు అమెరికా పాల్పడటం వెనుక ఇతర కారణాలు కూడా ఉన్నాయని వేరే చెప్పనవసరం లేదు. ఇటీవలి సంవత్సరాలలో చైనా తన మిలిటరీని నవీకరించటంతో పాటు ఎంతగానో విస్తరిస్తున్నది.దానిలో భాగంగానే తన నాలుగవ విమాన వాహక యుద్ధ నౌకను సిద్ధం చేసింది. ఈ అంశాన్ని చైనా పార్లమెంటు సమావేశాల సందర్భంగా వెల్లడించారు. అయితే అది అణ్వాయుధాలను మోసుకు పోగలదా లేదా అన్నది తరువాత వెల్లడిస్తామని పేర్కొన్నారు. అమెరికా-చైనా నౌకలకు ఉన్న తేడా ఏమిటన్న మీడియా ప్రశ్నకు తాము అమెరికాతో పోటీ పడటం లేదని తమ సార్వభౌమత్వం, సరిహద్దులను రక్షించుకొ నేందుకు తమ నౌకలు పని చేస్తాయని చైనా ప్రతినిధి అన్నారు. అమెరికా నౌకలు ప్రపంచంలో అనేక ప్రాంతాలలో సంచరిస్తూ తమకు లొంగని దేశాలను బెదిరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మధ్యధరా సముద్రంలో తిష్టవేసిన నౌకలు ఇరాన్‌, సిరియా, ఎమెన్‌ తదితర దేశాలను బెదిరిస్తున్నాయి. అమెరికా నౌకలకు ధీటుగా ఉంటాయా అన్న ప్రశ్నకు తాము వాటినే కాదు, ఇతర ముప్పులను కూడా సమగ్రంగా ఎదుర్కొనగలమని చైనా జవాబిచ్చింది. ప్రస్తుతం చైనా వద్ద రెండు విమానవాహక నౌకలు ఉన్నాయి. మూడవ ఆధునిక నౌక పరీక్షలు పూర్తి చేసుకొని త్వరలో రంగంలోకి దిగనుంది. ఈ లోగానే నాలుగవ నౌక గురించి వెల్లడించటం, మరికొన్నింటిని రూపొందిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
సహజంగా ఒక విమాన వాహక యుద్ధ నౌకను రంగంలోకి దింపిన తరువాత ఏడాదిలో మూడోవంతు నిర్వహణ, మరో మూడో వంతు శిక్షణ, మిగిలిన సమయంలో మాత్రమే అవసరాలకు సిద్ధంగా ఉంటుంది. ఆ లెక్కన ప్రస్తుతం చైనా వద్ద ఒక నౌక మాత్రమే సిద్దంగా ఉన్నట్లని, మరికొన్ని నౌకలు రంగంలోకి వస్తే ఎక్కడికైనా పంపగల సామర్ధ్యం చైనాకు వస్తుందని మిలిటరీ నిపుణులు చెబు తున్నారు. అవి పరిసరాల్లోనే గాక సుదూరంగా సముద్రాల్లో కార్యకలాపాల నిర్వహణకు అనువుగా ఉంటాయనే సమా చారం సహజంగానే అమెరికా, దాని మిత్రదేశాల వెన్నులో వణుకు పుట్టించేదే అని వేరే చెప్పనవసరం లేదు.

Spread the love